Telugu Global
Telangana

అదొక ఫేక్‌ లిస్ట్.. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు!

కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారంటూ ఒక ఫేక్ లిస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు.

అదొక ఫేక్‌ లిస్ట్.. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించలేదు!
X

తెలంగాణ అసెంబ్లీకి 2023 డిసెంబర్‌లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి.. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారన్న వార్తలో ఎలాంటి నిజం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కొంత మంది అభ్యర్థులు, వారికి కేటాయించిన అసెంబ్లీ సెగ్మెంట్ల పేరుతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి తమ నాయకుల పేర్లు లేకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే అదొక ఫేక్ లిస్ట్ అని పార్టీ స్పష్టం చేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రతినిధుల సభను ఏర్పాటు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 7 తీర్మానాలను ప్రవేశపెట్టగా.. వాటికి సభలోని ప్రతినిధులు ఆమోదం తెలిపారు. మధ్యాహ్నం వరకు తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మరోసారి ప్రసంగించారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఇంకా తమ తీరును మార్చుకోవట్లేదని.. తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లి పని తీరును మెరుగు పరుచుకోవాలని హెచ్చరించారు.

మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో కొంత మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావడం లేదని.. కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారంటూ ఒక ఫేక్ లిస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. అయితే ఇదొక ఫేక్ న్యూస్ అని.. కావాలనే ప్రత్యర్థులు పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేయడానికి సృష్టించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో మునిగిన లక్షలాది మంది కార్యకర్తల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి కుట్ర చేసి ఉంటారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మొత్తానికి అదొక ఫేక్ లిస్ట్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  27 April 2023 1:21 PM GMT
Next Story