Telugu Global
Telangana

తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌‌కు ధన్యవాదాలు : మంత్రి కేటీఆర్

ఒకప్పుడు ఎగతాళి చేసిన తెలంగాణ యాస, సంస్కృతికి ఇవ్వాళ అధిక ప్రాధాన్యత లభిస్తుండటం చాలా సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.

తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌‌కు ధన్యవాదాలు : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం తీసుకొని వచ్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన తెలంగాణ యాస, సంస్కృతికి ఇవ్వాళ అధిక ప్రాధాన్యత లభిస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మంత్రి కేటీఆర్‌కు ప్రముఖ డాక్టర్ దండె శ్రీరాములు చేసిన వాట్సప్ మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ మార్పుకు సీఎం కేసీఆర్‌ కారణమని ట్విట్టర్‌లో మంత్రి పేర్కొన్నారు.

తెలుగు సినిమాలు ఇటీవల తెలంగాణ యాసతో నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. బలగం, దసరా వంటి సినిమాలు చూస్తే చాలా గర్వంగా ఉంది. సినిమా రంగంలో ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్ గారికే చెందుతుంది అని డాక్టర్ దండె శ్రీరాములు మెసేజ్‌లో పేర్కొన్నారు. 68 ఏళ్ల వయసున్న నేను ఇలాంటి మార్పు వస్తుందని ఏనాడూ కలగనలేదని చెప్పారు. 20 ఏళ్ల క్రితమే తాను థియేటర్లకు వెళ్లడం మానేశానని.. ఎందుకంటే ఆయా సినిమాల్లో తెలంగాణ యాస, ఇక్కడి వారిని విలన్లుగా లేదా జోకర్లుగా చిత్రీకరించడమే అని వివరించారు.

కాగా, ఈ వాట్సప్ మెసేజ్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేయవచ్చా అని సదరు డాక్టర్‌ను కేటీఆర్ కోరారు. ఆయన అనుమతి మేరకే ఆ వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్లను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, బలగం సినిమా ప్రీ రిలీజ్ వేడుక సిరిసిల్లలో నిర్వహించారు. ఈ సినిమాను కూడా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లోనే నిర్మించారు. ఆ వేడుకలో తెలుగు సినిమా నిర్మాతలు ఇప్పుడు తెలంగాణలో కూడా సినిమాలు తీయాలని కోరారు. మంచి లొకేషన్లు అందుబాటులో ఉన్నాయని.. ఇప్పుడు తెలంగాణ అంతా పచ్చగా మారిపోయిందని కేటీఆర్ చెప్పారు. ఇందుకు ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం, కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టులే కారణమని చెప్పారు.


First Published:  1 April 2023 7:29 AM GMT
Next Story