Telugu Global
Telangana

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి ఠాక్రే, సంపత్ వెళ్లింది బుజ్జగింపులకు కాదా?

రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చేరికల విషయం మాట్లాడటానికే ఏఐసీసీ దూతలుగా ఠాక్రే, సంపత్ కుమార్ వెళ్లినట్లు చర్చ జరుగుతున్నది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి ఠాక్రే, సంపత్ వెళ్లింది బుజ్జగింపులకు కాదా?
X

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది విలక్షణమైన శైలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఒక వెలుగు వెలిగిన కోమటిరెడ్డి.. ఆ తర్వాత ఎందుకో వెనుకబడి పోయారు. చీటికీ మాటికి అలగడం.. సొంత పార్టీ నేతల పైనే విమర్శలు చేయడం కోమటిరెడ్డి స్టైల్. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించి కోమటిరెడ్డి విఫలం అయ్యారు. దీంతో ఏకంగా అధిష్టానంపైనే విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నాడంటూ తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు.

ఒకానొక దశలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నంత కాలం గాంధీభవన్ గడప తొక్కనంటూ ప్రతిజ్ఞ చేశారు. అయితే కోమటిరెడ్డి ఆవేశంలో ఎలా మాట్లాడినా.. నాలుగు రోజుల తర్వాత అన్నీ మర్చిపోతారనే మాట స్వయంగా కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు కూడా అతడికి నచ్చచెప్పకుండా.. రివర్స్‌లో కాంగ్రెస్ పార్టీపైనే ఎటాక్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలిగినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనకు సీడబ్ల్యూసీ, కేంద్ర ఎన్నికల కమిటీలో స్థానం కల్పించలేదని అలక బూనినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సభ్యుడు సంపత్ కుమార్.. కోమటిరెడ్డి ఇంటికి బుజ్జగించడానికే వెళ్లారని చర్చ జరిగింది.

కాగా, కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం మాత్రం వాళ్లిద్దరూ కోమటిరెడ్డిని బుజ్జగించడానికి వెళ్లలేదని చెబుతున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రాకకు ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కుంభం అనిల్ కుమార్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భువనగిరికి చెందిన అనిల్ కుమార్.. తనకు టికెట్ ఇస్తే తప్పకుండా తిరిగి వస్తానని చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఆయన భువనగిరి అసెంబ్లీ టికెట్ రామాంజనేయ గౌడ్‌కు ఇప్పిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తున్నది. మరోవైపు చిరుమర్తి లింగయ్య రాకను కూడా అడ్డుకుంటున్నట్లు సమాచారం.

ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చేరికల విషయం మాట్లాడటానికే ఏఐసీసీ దూతలుగా ఠాక్రే, సంపత్ కుమార్ వెళ్లినట్లు చర్చ జరుగుతున్నది. గెలిచే అభ్యర్థులను పార్టీలోకి రాకుండా అడ్డుకోవడం సబబు కాదని.. మీరు మాట ఇచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే విధంగా సర్థుబాటు చేద్దామని కోమటిరెడ్డికి వాళ్లిద్దరూ చెప్పినట్లు సమాచారం. అంతే కానీ, కేంద్ర ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ కమిటీల్లో చోటు దక్కనందుకు అలకబూనిన కోమటిరెడ్డిని బుజ్జగించేందుకు వెళ్లారన్న దానిలో నిజం లేదని చెబుతున్నారు. ఏదేమైనా కోమటిరెడ్డి అలక పాన్పు నుంచి ఎప్పుడు దిగుతారా అని నల్గొండ నాయకులు ఎదురు చేస్తున్నారు.

First Published:  7 Sep 2023 2:21 PM GMT
Next Story