Telugu Global
Telangana

ఆర్టీసీలో కొత్తగా పెయిడ్ సర్వీస్.. ఎప్పట్నుంచంటే..?

ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే డీలక్స్ బస్సుల్లో మాత్రం ఇలాంటి ఉచితాలు ఉండవు.

ఆర్టీసీలో కొత్తగా పెయిడ్ సర్వీస్.. ఎప్పట్నుంచంటే..?
X

తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆక్యుపెన్సీ రేషియో పెరిగినా కూడా.. తగినంత ఆదాయం రావడంలేదని సంస్థ వాపోతోంది. ప్రభుత్వం నుంచి సకాలంలో బకాయిలు అందితేనే సంస్థకు లాభం. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలపై కూడా తెలంగాణ ఆర్టీసీ దృష్టిపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా డీలక్స్ బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు హైదరాబాద్ నగర పరిధిలో కూడా 125 డీలక్స్ బస్సుల్ని రోడ్డెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి రాయితీలు వర్తించవని తెలుస్తోంది. ప్రత్యేకంగా పెయిడ్ సర్వీస్ పేరుతో వీటిని ఉచితాలు లేకుండా నడపాలనుకుంటున్నారు అధికారులు.

హైదరాబాద్ సిటీ పరిధిలో ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ఉచిత రవాణాకు సరిపోతున్నాయి. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో పురుషులకు సీట్లు లేకుండా పోతున్నాయి. సీట్ల వద్ద లేనిపోని పంచాయితీలు అదనం. రద్దీని తట్టుకునేందుకు కొత్త బస్సుల్ని తెప్పిస్తోంది ఆర్టీసీ. 25 ఎలక్ట్రిక్‌ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి చేరుకున్నాయి.హైదరాబాద్ సిటీలో ప్ర‌యాణించేందుకు వీలుగా 125 డీలక్స్‌ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటు లోకి తీసుకొస్తున్నారు. ఈ బస్సులు జులై నుంచి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు అధికారులు.

ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే డీలక్స్ బస్సుల్లో మాత్రం ఇలాంటి ఉచితాలు ఉండవు. మహిళల ఉచిత రవాణాతోపాటు, పాస్ హోల్డర్స్ కి కూడా ఇందులో రాయితీలు వర్తించవు. పెయిడ్ సర్వీస్ పేరుతో వీటిని నడుపుతారని తెలుస్తోంది.

First Published:  26 May 2024 4:32 AM GMT
Next Story