Telugu Global
Telangana

సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు నిర్మించారు. గతంలోనే సచివాలయాన్ని ప్రారంభించినా.. ఈ మందిరాల ప్రారంభం మాత్రం ఇప్పుడు జరిగింది.

సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభం
X

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆమెకు సాదర స్వాగతం పలికారు. గవర్నర్ తో కలసి సచివాలయ ప్రాంగణంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. సర్వమత ప్రార్థనాలయాలను ప్రారంభించారు.

తెలంగాణ నూతన సచివాలయంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు నిర్మించారు. గతంలోనే సచివాలయాన్ని ప్రారంభించినా.. ఈ మందిరాల ప్రారంభం మాత్రం ఇప్పుడు జరిగింది. హిందు, ముస్లిం, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఈరోజు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ప్రార్థనా మందిరాలను ప్రారంభించారు.

ముందుగా సచివాలయ ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై‌, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత మసీదుని ప్రారంభించారు. ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం మసీదులో నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు సచివాలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు. ఈరోజు నుంచి ఈ ప్రార్థనామందిరాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. సచివాలయానికి వచ్చే సందర్శకులు, సచివాలయ సిబ్బంది కాసేపు ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా గడిపే అవకాశముంది.

First Published:  25 Aug 2023 8:10 AM GMT
Next Story