Telugu Global
Telangana

తెల్దారుపల్లి.. అక్కడ సీపీఎం ఎంతకైనా తెగిస్తుంది..!

ఖమ్మం రూరల్ మండలంలో భాగమైన ఈ గ్రామం.. మొదట్లో ఖమ్మం నియోజకవర్గంలో ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పాలేరు సెగ్మెంట్‌లోకి మారిపోయింది.

తెల్దారుపల్లి.. అక్కడ సీపీఎం ఎంతకైనా తెగిస్తుంది..!
X

తెల్దారుపల్లి.. ఈ ఊరి పేరు ఇవ్వాల ఒక హత్య కారణంగా మీడియాలో మార్మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మొదటి సారి ఈ పేరు వింటున్నారేమో..! కానీ ఖమ్మం జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి మాత్రం తెల్దారుపల్లి, అక్కడి పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే రహదారిలో తల్లంపాడు దాటిన తర్వాత సాగర్ కెనాల్ ఉంటుంది. ఆ కాలువ దాటక ముందు కుడివైపు వెళ్తే తెల్దారుపల్లి వస్తుంది. ఆ గ్రామం ఒక మేజర్ గ్రామ పంచాయతీ. మొదటి నుంచి సీపీఎంకు కంచు కోట ఆ గ్రామం. ఖమ్మం రూరల్ మండలంలో భాగమైన ఈ గ్రామం.. మొదట్లో ఖమ్మం నియోజకవర్గంలో ఉండేది. కానీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పాలేరు సెగ్మెంట్‌లోకి మారిపోయింది.

Advertisement

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. పాలేరులో ఏ పార్టీ వ్యక్తి ఎమ్మెల్యే అయినా.. తెల్దారుపల్లి మాత్రం సీపీఎం చేతిలోనే ఉంటుంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే తమ్మినేని వీరభద్రం సొంత ఊరు తెల్దారుపల్లి. వీరభద్రం తండ్రి సుబ్బయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు తమ్మినేని వీరభద్రం, ప్రస్తుత హత్య నిందితుడు కోటేశ్వరరావుతో పాటు మరో కొడుకు ఉన్నాడు. రెండో భార్య కొడుకే చనిపోయిన కృష్ణయ్య, తెల్దారుపల్లిలో మొదటి నుంచి వీరభద్రం హవానే నడిచింది. ముగ్గురు అన్నదమ్ములతో పాటు తమ్మినేని కృష్ణయ్య కూడా సీపీఎం పార్టీలోనే పని చేస్తున్నారు. అయితే మొదటి నుంచి తనకు అన్యాయం జరుగుతుందని భావించిన తమ్మినేని కృష్ణయ్య.. అన్న వీరభద్రంపై తిరుగుబాటు చేయడమే కాకుండా పార్టీ మారారు. కొన్నాళ్లుగా టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తూ.. పాలేరు మాజీ ఎమ్మెల్యే తుమ్మల అనుచరుడిగా కొనసాగుతున్నారు.

Advertisement

తమ్మినేని కృష్ణయ్య, కోటేశ్వరావు కుటుంబానికి మధ్య మొదటి సారి 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ సారి సర్పంచ్‌గా తన భార్య నిలబడుతుందని కృష్ణయ్య పట్టుబట్టారు. కానీ అదే సమయంలో ఆ పదవి తన కుటుంబానికి కావాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో స్వయంగా తమ్మినేని వీరభద్రం మధ్యవర్తిత్వం చేశారు. ఇద్దరు కూడా తగ్గకపోవడంతో చివరకు సర్పంచ్ పదవిని భిక్షం అనే వ్యక్తికి కట్టబెట్టారు.

కానీ ఆ తర్వాత కూడా ప్రతీ ఎలక్షన్లలో తమ్మినేని కృష్ణయ్య అడ్డుపడుతూ వచ్చాడు. ఎంపీటీసీ ఎన్నికల్లో తన భార్యను కృష్ణయ్య గెలిపించుకున్నాడు. అంతే కాకుండా ఆ తర్వాత జరిగిన టేకులపల్లి సొసైటీ ఎన్నికల్లో తాను స్వయంగా గెలవడమే కాకుండా.. మరో ఇద్దరినీ గెలిపించాడు. ఇవన్నీ తమ్మినేని వీరభద్రం, సీపీఎం పార్టీకి పరువు పోయేలా చేశాయి. మరోవైపు తమ్మినేని కోటేశ్వరరావు కూడా తన సవతి సోదరుడి కుటుంబం పరపతి పెరుగుతోందనే భావనలో కక్ష పెంచుకున్నాడు. మొదటి నుంచి తెల్దారుపల్లి సీపీఎం చేతిలోనే ఉండగా.. ఈ మధ్య కృష్ణయ్య కారణంగా టీఆర్ఎస్ బలోపేతం కావడం జీర్ణించుకోలేక పోయాడు.

తన ఇంటికి కూత వేటు దూరంలోనే ఉంటూ.. సీపీఎం పార్టీకి వ్యతిరేకంగా పని చేయడంపై తమ్మినేని వీరభద్రం ఫ్యామిలీ రగిలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గత 3 ఏళ్లుగా గ్రామంలో వీరి మధ్య గొడవల కారణంగా శాంతిభద్రతల సమస్య ఏర్పడుతోంది. తనను ఎలాగైనా చంపేస్తారని గతంలో కృష్ణయ్య కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామంలో ఇంత గొడవలు జరుగుతున్నా.. ఒక్క పోలీస్ కంప్ల‌యింట్ కూడా లేకుండా సీపీఎం జాగ్రత్త పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏనాటికైనా కృష్ణయ్య తమ కుటుంబానికి, ఫ్యామిలీకి సమస్యే అని భావించి అతడిని హత్య చేసినట్లు తెలుస్తున్నది.

అదొక భయానక గ్రామం..

ఖమ్మం రూరల్ మండలంలో ఎన్నో గ్రామాలు ఉన్నా.. తెల్దారుపల్లి అంటే ఒక హడల్. అక్కడ సీపీఎం పార్టీ ఎంతకైనా తెగిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ఆ గ్రామంలో తొలిసారిగా 1997లో జరిగిన రాజకీయ హత్య గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పట్లో సీపీఎం పార్టీకి వ్యతిరేకంగా వేగినాటి వెంకయ్య పని చేశారు. పట్వారీగా పనిచేసే ఆయన, చెన్నారెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో వీఆర్ఏగా మారారు. మొదట్లో సీపీఎం పార్టీతోనే ఉన్నా.. ఆ తర్వాత మాత్రం తెలుగుదేశంలో చేరారు. వీఆర్ఏగా పని చేస్తూనే తెలుగుదేశం కార్యకర్తగా కొనసాగారు. ఈ క్రమంలో తెల్దారుపల్లి గ్రామంలో తెలుగుదేశం గద్దెను ఏర్పాటు చేశారు. ఇది సీపీఎం పార్టీ నేతలకు రుచించలేదు.

తెల్దారుపల్లి గ్రామంలో వేరే పార్టీ గద్దె నిర్మాణం జరగడంతో ఆగ్రహించి పట్వారి వెంకయ్యను దారుణంగా హత్య చేశారు. అతడిని చంపడంతోనే వారి కోపం చల్లారలేదు. టీడీపీ గద్దెను కూల్చేయడంతో పాటు.. వెంకయ్య సమాధిని కూడా ధ్వంసం చేసినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత కూడా పోలీసు కేసుల వరకు వెళ్లని హత్యలు జరిగాయని, కానీ బయటకు చెబితే తమకు ముప్పని చాలా మంది ఇప్పటికీ నోర్మూసుకొని ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రశాంతంగా ఉన్న ఖమ్మం రూరల్ మండలం.. కృష్ణయ్య హత్యతో అట్టుడుకుతోంది.

Next Story