Telugu Global
Telangana

తెలంగాణలో రికార్డులు సృష్టించిన వానాకాలం వరి ధాన్యంసేకరణ

శుక్రవారం వరకు రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 36.87 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు.

తెలంగాణలో రికార్డులు సృష్టించిన వానాకాలం వరి ధాన్యంసేకరణ
X

వానాకాలం వరి ధాన్యం సేకరణలో తెలంగాణ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 38.06 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ప్రభుత్వం.

గత ఏడాది నవంబర్‌లో సేకరించిన 25.84 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ శనివారం తెలిపారు.

శుక్రవారం వరకు రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 36.87 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు.

ఇప్పటి వరకు సేకరించిన వరి ధాన్యం మొత్తం రూ.7,837 కోట్లు కాగా రైతులకు రూ.4,780 కోట్లు చెల్లించారు. కొనుగోళ్లలో భాగంగా 9.52 లక్షల గన్నీ బ్యాగులను వినియోగించగా, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అదనంగా 9.16 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. షెడ్యూల్ కన్నా ముందే అనేక ప్రాంతాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి, 729 కొనుగోలు కేంద్రాలు మూసివేయబడ్డాయి.

కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద పాడీ క్లీనర్‌లు, తేమ యంత్రాలు, టార్పాలిన్‌లు తదితర అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న‌ రైతు అనుకూల విధానాలు, సరిపడా నీటి లభ్యత కారణంగా ఈ ఏడాది వరి నాణ్యత మరింత పెరిగిందని గంగుల కమలాకర్ అన్నారు.

'భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మళ్లీ రూపుదిద్దుకుంది. రైతులకు అందించే కనీస మద్దతు ధర ప్రైవేట్ కొనుగోలుదారులు అందించే ధర కంటే ఎక్కువగా ఉంది, "అని మంత్రి గంగుల పేర్కొన్నారు. ఇది రైతు సమాజానికి గొప్ప‌ సంకేతమని అన్నారు.

డిసెంబరులో కోతలు పూర్తవుతున్నందున కొనుగోళ్లను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మొత్తానికి ఏడాదికేడాది వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. గతంలో వ్యవసాయం చేయడమంటే ఆత్మహత్యాసదృశ్యమే అనుకునే స్థితి నుండి , పెరిగిన సాగు నీటి సౌకర్యం, ధాన్యానికి మద్దతు ధర, ఇంటి ముందే కొనుగోలు కేంద్రాలు , రైతు బంధు వంటి కార్యక్రమాల వల్ల వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా రైతులు అనుకునే పరిస్థితికి వచ్చింది.

మరో వైపు వరి ధాన్యం కొనడంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన‌ స్వంత సొమ్ముతో ధాన్యం సేకరణ జరపడం కూడా రైతుల్లో స్థైర్యాన్ని నింపింది.

First Published:  3 Dec 2022 3:50 PM GMT
Next Story