Telugu Global
Telangana

పోలవరంపై సుప్రీంలో తప్పుడు అఫిడవిట్.. సీడబ్ల్యూసీకి అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ లేఖ

పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో ముడిపడి ఉన్న సమస్యలను తేల్చకుండా.. వాస్తవ విరుద్ధమైన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలంగాణ పేర్కొన్నది.

పోలవరంపై సుప్రీంలో తప్పుడు అఫిడవిట్.. సీడబ్ల్యూసీకి అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ లేఖ
X

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు రాష్ట్రాలతో సంప్రదింపులు పూర్తయ్యాయంటూ కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌పై తెలంగాణ ప్రభుత్వం మండిపడింది. అత్యున్నత కోర్టులో తప్పుడు వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ విషయంపై తాము కూడా సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కు లేఖ రాసింది.

పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ఏర్పడే ముంపును తేల్చడం, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సంబంధిత రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలంటూ గతేడాది చివర్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర జల సంఘం నాలుగు విడతలుగా సమావేశాలు నిర్వహించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని, ఆవాసాలు ముంపు బారిన పడతాయని, స్థానికంగా ఉండే వాగులు బ్యాక్ వాటర్ కారణంగా స్తంభించి ముంపు ఏర్పడుతుందని సీడబ్ల్యూసీకి తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. ఇందుకు అవసరమైన సర్వేను నిర్వహించాలని కూడా కోరింది.

కాగా, పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో ముడిపడి ఉన్న సమస్యలను తేల్చకుండా.. వాస్తవ విరుద్ధమైన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలంగాణ పేర్కొన్నది. ముంపుపై సంయుక్త సర్వే చేయాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాలను పీపీఏగానీ, ఏపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదని తెలిపింది. బ్యాక్ వాటర్ సమస్యపై ఛత్తీస్‌గఢ్, తెలంగాణతో సయోధ్య కుదిరినట్లు అఫిడవిట్‌లో తప్పుగా పేర్కొనడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ ఒక్క అంశంపై కూడా సయోధ్య కుదరలేదని, సంయుక్త సర్వే చేపట్టకుండానే సంప్రదింపులు ముగిశాయని పేర్కొనడం అభ్యంతరకరమని చెప్పింది. ఈ మేరకు సీడబ్ల్యూసీకి లేఖ రాసింది.

పాలమూరు నీటి కేటాయింపులపై నేడు ట్రిబ్యునల్ ఉత్తర్వులు..

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులపై కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) బుధవారం ఉత్తర్వులు జారీ చేయనున్నది. పాలమూరు ప్రాజెక్టుకు 90 టీసీఎంల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై నిరుడు డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది.

చిన్న నీటి వనరుల వినియోగం కింద మిగులు 45 టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటిలో నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలు వినియోగించుకునే వెసులు బాటు తమకు ఉందని తెలంగాణ చెబుతోంది. ఆ మేరకే కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ ఎదుట సవాల్ చేసింది.

First Published:  20 Sep 2023 3:48 AM GMT
Next Story