Telugu Global
Telangana

తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి.. ఆ రికార్డ్ హైదరాబాద్ ది కాదు

రాష్ట్రంలో ఇదే అతి పెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అవతరించబోతోంది. 2వేల బెడ్స్ కెపాసిటీ ఈ ఆస్పత్రి సొంతం. ఇతర అధునాతన సౌకర్యాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి.

తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి.. ఆ రికార్డ్ హైదరాబాద్ ది కాదు
X

రాష్ట్రానికి తలమానికంగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సౌకర్యాలు.. సహజంగా రాజధాని ప్రాంతంలోనే అందుబాటులో ఉంటాయి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా రాష్ట్రాన్ని అడుగులు వేయిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. ఇందులో భాగంగానే వరంగల్ లో రాష్ట్రానికే తలమానికంగా అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి నిర్మితమవుతోంది. ఈ పనులు ఇప్పుడు చురుగ్గా సాగుతున్నాయి. వరంగల్ ఆస్పత్రి పనుల పురోగతిని ట్విట్టర్లో వివరిస్తూ.. సీఎం కేసీఆర్ కి, ఆయన ముందు చూపుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.


ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న తెలంగాణ ఆస్పత్రుల్లో గాంధీ, ఉస్మానియా పేర్లే ప్రముఖంగా వినిపిస్తుంటాయి. వరంగల్ ఆస్పత్రి వాటిని తలదన్నేలా అధునాతన సౌకర్యాలతో రెడీ అవుతోంది. రాష్ట్రంలో ఇదే అతి పెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అవతరించబోతోంది. 2వేల బెడ్స్ కెపాసిటీ ఈ ఆస్పత్రి సొంతం. ఇతర అధునాతన సౌకర్యాలు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయి. వరంగల్ కే కాదు, రాష్ట్రానికే తలమానికంగా ఈ ఆస్పత్రి రూపుదిద్దుకుంటోంది.

24 అంతస్తుల్లో అద్భుత నిర్మాణం..

మొత్తం 24 అంతస్తుల్లో అద్భుతంగా ఈ నిర్మాణం కొనసాగుతోంది. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణంతో ఆరోగ్య రంగం వికేంద్రీకరణ సాకారమవుతోందని చెప్పారు. ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయన్నారు కేటీఆర్.

First Published:  19 April 2023 1:28 PM GMT
Next Story