Telugu Global
Telangana

తెలంగాణ దాచుకున్న నీటిని ఏపీ వాడేసింది.. కేఆర్ఎంబీకి ప్రభుత్వం ఫిర్యాదు

ఏపీ ఇప్పటి వరకు కృష్ణా నదిలో 205 టీఎంసీల మేర నీటిని వాడుకున్నది. ఇది కృష్ణా నదిలో ఆ రాష్ట్రానికి కేటాయించిన దాని కంటే ఎక్కువ అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

తెలంగాణ దాచుకున్న నీటిని ఏపీ వాడేసింది.. కేఆర్ఎంబీకి ప్రభుత్వం ఫిర్యాదు
X

హైదరాబాద్ సహా ఇతర పట్టణాల తాగు నీటి అవసరాల కోసం తెలంగాణ దాచుకున్న నీటిని ఏపీ వాడేసింది. కృష్ణా నదిలో ఏపీకి కేటాయించిన నీటి వాటాను మించి వాడేయడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంమైంది. ఏపీ అత్యధిక నీటిని వాడిందంటూ, దీంతో తమకు ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి శుక్రవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ లేఖ రాశారు.

ఏపీ ఇప్పటి వరకు కృష్ణా నదిలో 205 టీఎంసీల మేర నీటిని వాడుకున్నది. ఇది కృష్ణా నదిలో ఆ రాష్ట్రానికి కేటాయించిన దాని కంటే ఎక్కువ అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ, ఏపీకి కేటాయించిన 33:66 కోటా ప్రకారం చూసినా ఆ రాష్ట్రం 51 టీఎంసీల మేర ఎక్కువ నీటినే వాడుకుందని లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది.

తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు లేవు. దీంతో చాలా కాలంగా ఇరు రాష్ట్రాలకు చెందిన నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోనే నీటిని దాచి పెడుతోంది. తమ వాటాను అవసరాల మేరకే వాడుతూ.. మిగులు జలాలను నాగార్జునసాగర్‌లోనే ఉంచుతోంది. దాదాపు 18 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌లో దాచిపెట్టినట్లు ఇరిగేషన్ శాఖ తెలిపింది.

అయితే, కామన్ రిజర్వాయర్‌లో తెలంగాణ దాచిన నీటిని.. ఏపీ అక్రమంగా వాడేసింది. తమ సాగు, తాగునీటి అవసరాల కోసం దాచిపెట్టిన నీటిని.. తమకు తెలియకుండా అక్రమంగా వాడేసిందని కేఆర్ఎంబీకి లేఖలో ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు అత్యధికంగా వాడిన నీటిని ఏపీ ఖాతాలో వేయాలని.. భవిష్యత్‌లో ఆ మేరకు కోత విధించి.. తెలంగాణకు కేటాయించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

2023 జూలైలో తాగు నీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీళ్లు అవసరమని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు ఎలాంటి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో తెలంగాణ నీటినే వాడేసిందని ఈఎన్‌సీ మురళీధర్ తెలిపారు.

First Published:  12 Aug 2023 2:44 AM GMT
Next Story