Telugu Global
Telangana

చరిత్ర సృష్టించిన తెలంగాణ నిర్మాణాలు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ అవార్డులు గెలిచిన కట్టడాలు

లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా పలు కేటగిరీల్లో భవన నిర్మాణాలకు అవార్డులు అందజేస్తోంది.

చరిత్ర సృష్టించిన తెలంగాణ నిర్మాణాలు.. దేశంలో తొలిసారి అంతర్జాతీయ అవార్డులు గెలిచిన కట్టడాలు
X

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణాలు చరిత్ర సృష్టించాయి. నిజాం కాలం నుంచి నేటి వరకు నిర్మించిన కట్టడాల్లోని ఐదింటికి అంతర్జాతీయ అవార్డులు లభించాయి. దేశంలోని కట్టడాలకు ఇలాంటి అవార్డులు రావడం తొలిసారి కాగా, అందులో ఐదుకు ఐదు అవార్డులు తెలంగాణలోని నిర్మాణాలకే రావడం గమనార్హం. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ.. ప్రపంచ వ్యాప్తంగా పలు కేటగిరీల్లో భవన నిర్మాణాలకు అవార్డులు అందజేస్తోంది. 1994లో స్థాపించబడిన ఈ సంస్థ తాజాగా తెలంగాణలోని ఐదు కట్టడాలకు గ్రీన్ ఆపిల్ అవార్డులు ప్రకటించింది.

హైదరాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్‌కు వారసత్వ కట్టడాల్లో ఉత్తమ పునరుద్దరణకు అవార్డు లభించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి వంతెనల విభాగంలో అరుదైన డిజైన్‌గా అవార్డు ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయానికి అందమైన కార్యాలయ నిర్మాణంగా.. బంజారాహిల్స్‌లో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అరుదైన కార్యాలయ నిర్మాణంగా అవార్డు గెలుచుకున్నది. ఇక యాదాద్రి దేవాలయం అద్భుతమైన ఆధ్యాత్మిక నిర్మాణంగా అవార్డును గెలిచింది. ఇండియాలో ఇలాంటి అవార్డులు ఒక రాష్ట్రం గెలవడం ఇదే తొలిసారి.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు కట్టడాలను అవార్డుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ సహకారంతో ఎంట్రీలు పంపించామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అందమైన భవంతుల కోసం ఇంటర్నేషనల్ గ్రీన్ ఆపిల్ ఇస్తున్న అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీలు పంపగా.. ఐదింటికి అవార్డులు వచ్చాయని చెప్పారు.

జూన్ 16న లండన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అరవింద్ కుమార్ ఈ అవార్డులు అందుకోవడానికి లండన్ వెళ్లనున్నారు.

First Published:  14 Jun 2023 8:11 AM GMT
Next Story