Telugu Global
Telangana

షర్మిల సహా వాళ్ల కుటుంబం అంతా తెలంగాణ వ్యతిరేకులే : ప్రభుత్వ విప్ బాల్క సుమన్

సంస్కారహీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జరిగే పరిణామాలకు టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించదని సుమన్ చెప్పారు.

షర్మిల సహా వాళ్ల కుటుంబం అంతా తెలంగాణ వ్యతిరేకులే :  ప్రభుత్వ విప్ బాల్క సుమన్
X

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సహా.. వైఎస్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ వ్యతిరేకులే అని, కావాలనే షర్మిల రాష్ట్రంపై విషం కక్కుతోందని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, కానీ ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన షర్మిల మాత్రం అడ్డగోలుగా మాడ్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో బాల్క సుమన్ బుధవారం విలేకరులతో మాట్లాడారు.

ఎవరిని పడితే వాళ్లను పట్టుకొని మాట్లాడితే బాగుండదని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నల్లిలాగ నలిపేస్తామని సుమన్ హెచ్చరించారు. సర్పంచ్‌గా కూడా గెలవని షర్మిల బతుకెంత అంటూ సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జరిగే పరిణామాలకు టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించదని చెప్పారు. షర్మిల పరిస్థితికి ఆమె అడ్డగోలుగా మాట్లాడే భాషే కారణమని అన్నారు. తాము తలుచుకుంటే షర్మిల ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదని హెచ్చరించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఒక నాడు తెలంగాణను వ్యతిరేకించారు. అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని సుమన్ చెప్పారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నంద్యాలలో జరిగిన సభలో 'హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకొని పోవాలి' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. గతంలో షర్మిల కూడా.. హైదరాబాద్‌లో సీమాంధ్రులు బతకాలంటే పాకిస్తాన్‌లో బతికినట్లు ఉందంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

వైఎస్ జగన్ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్ సన్నిహితుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కుటుంబం అంతా తెలంగాణ వ్యతిరేకులే.. అలాంటి వాళ్లు రాష్ట్రానికి ఏం చేస్తారని సుమన్ ప్రశ్నించారు. చెన్నూరుకు వచ్చినప్పుడు కూడా షర్మిల తనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ తానే కార్యకర్తలను సముదాయించానని సుమన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల్లో వైఎస్ కుటుంబంపై కోపం ఉందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని షర్మిల, ఆమె భర్త అనిల్ బయ్యారం ఐరన్ గనులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వీళ్లు అనేక భూకబ్జాలకు పాల్పడ్డారన్నారు.

షర్మిల తన భాష మార్చుకోవాలి. ఏమైనా జరిగితే తమకు సంబంధం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి గురించి గవర్నర్‌కు తెలియదా..? షర్మిల తమను దూషించిన విషయం కనపడలేదా..? ఆమె సంస్కారహీనంగా తిడుతుంటే.. మేం దానికి స్పందించవద్దా అని గవర్నర్ తమిళిసైని సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ వనరులు దోచుకున్న ఘనత వైఎస్ కుటుంబానిదని.. ఆనాడు మానుకోటలో జగన్‌ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న విషయాన్ని షర్మిల మర్చిపోయారా అని సుమన్ అన్నారు. గోదావరి, కృష్ణ నీటిని ఆంధ్రా ప్రాంతానికి తరలించింది ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసని సుమన్ చెప్పారు. ఇప్పటికైనా షర్మిల తన తీరును మార్చుకోవాలని.. లేకుంటే భవిష్యత్‌లో జరిగే తీవ్ర పరిణామాలకు టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించదని సుమన్ స్పష్టం చేశారు.

First Published:  30 Nov 2022 2:32 PM GMT
Next Story