Telugu Global
Telangana

తెలంగాణ పల్లెలకు జాతీయ అవార్డులు..

తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయన్నారు సీఎం కేసీఆర్. ఎనిమిది విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించడం విశేషమని పేర్కొన్నారు.

తెలంగాణ పల్లెలకు జాతీయ అవార్డులు..
X

పల్లెల అభివృద్ధి విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. అవార్డులు దక్కించుకున్న మొత్తం 46 గ్రామాల్లో 13 గ్రామాలు తెలంగాణకే చెందినవి కావడం విశేషం. 'దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతి సతత్ వికాస్ పురస్కార్' పేరిట ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయన్నారు సీఎం కేసీఆర్. ఎనిమిది విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించడం విశేషమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయి. ప్రకటించిన మొత్తం అవార్డుల్లో 30శాతం తెలంగాణ కైవసం చేసుకోవడం సంతోషకరం అన్నారు సీఎం కేసీఆర్. ఈ 13 ర్యాంకుల్లో నాలుగు ఫస్ట్‌ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్ప విషయం అన్నారు.


పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌ లను అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.

First Published:  17 April 2023 4:09 PM GMT
Next Story