Telugu Global
Telangana

దాతల అవయవ మార్పిడిలో అగ్రస్థానంలో తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా అవయవ మార్పిడిని నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక బహుళ అవయవ మార్పిడి కేంద్రాన్ని నిర్మించడానికి 35 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

దాతల అవయవ మార్పిడిలో అగ్రస్థానంలో తెలంగాణ
X

2021, 2022లో మరణించిన దాతల అవయవ మార్పిడిలో దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు తెలంగాణ , మహారాష్ట్ర అని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. వేలూరు ఎంపీ డీఎం కతీర్ ఆనంద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో చొరవచూపుతున్న‌ రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి అని కేంద్ర మంత్రి తెలిపారు.

దేశంలో అర్హులైన రోగులకు మృతదేహాల‌, లైవ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సులభతరం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై, అవయవదానంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (NOTTO), ప్రాంతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ROTTO), రాష్ట్ర అవయవ, కణజాల మార్పిడి సంస్థ (SOTTO), వెబ్‌సైట్ www.notto.gov.in ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేయడం; 24×7 కాల్ సెంటర్, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ (1800114770)తో సమాచారం అందించడం, టెలీ-కౌన్సెలింగ్, అవయవ దానం కోసం సహాయం చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తన వంతుగా అవయవ మార్పిడిని నిర్వహించడానికి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక బహుళ అవయవ మార్పిడి కేంద్రాన్ని నిర్మించడానికి 35 కోట్ల రూపాయలను విడుదల చేసింది. “హై-ఎండ్ సదుపాయం ఆరు నెలల్లో సిద్ధంగా ఉంటుంది. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయని, అయితే దీన్ని మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉందని గత నవంబర్‌లో జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మంత్రి టి హరీశ్‌రావు అన్నారు.

ఇంకా, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ముందుకు తీసుకువెళ్లే దిశగా, జిల్లా ఆసుపత్రుల నుండి హైదరాబాద్‌లోని బోధనాసుపత్రులకు బ్రెయిన్ డెడ్ రోగుల దానం చేసిన అవయవాలను రవాణా చేయడానికి ఛాపర్‌లను ఉపయోగిస్తోంది.

First Published:  4 Feb 2023 1:51 AM GMT
Next Story