Telugu Global
Telangana

స్పీడంతా సింగిల్ ఇంజిన్ దే.. రుజువులివిగో..

ఇతర రాష్ట్రాలను సైతం వెనక్కు నెట్టి తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. అభివృద్ధికి, సంక్షేమానికి డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం లేదు, టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం ఒక్కటి ఉన్నా చాలు అని నిరూపించింది.

స్పీడంతా సింగిల్ ఇంజిన్ దే.. రుజువులివిగో..
X

డబుల్ ఇంజిన్ సర్కారుతో అద్భుతాలు సాధించవచ్చని డబ్బా కొట్టుకుంటున్న కేంద్రానికి ఇది కనువిప్పు కలిగించే అంశం. సింగిల్ ఇంజిన్ సర్కారు అయిన తెలంగాణ ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో అదరగొడుతోంది. అభివృద్ధి గురించి కేంద్రం పొగడాల్సిన పనిలేదు, జీఎస్డీపీ తో ఆ విషయం స్పష్టమైపోతోంది. సంక్షేమం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణకు వస్తున్న అవార్డులే దానికి నిదర్శనం. తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో రాష్ట్రం అసాధారణ ప్రగతి కనబరిచిందని ఆ నివేదికలే చెబుతున్నాయి. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ లో దేశంలోని టాప్‌-10 జిల్లాల్లో 6, టాప్‌-25 జిల్లాల్లో 15 తెలంగాణకు చెందినవే. మొత్తంగా తెలంగాణలోని 32 జిల్లాలు టాప్‌-51 జాబితాలో నిలిచాయి. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఒకే ఒక్క జిల్లా ఉంది. మిగతా దక్షిణాది రాష్ట్రాలకు చోటే లేదు. అందులో బీజేపీ పాలిత కర్నాటక కూడా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పూర్తి నివేదికలో తెలంగాణలోని గ్రామాల పనితీరు అత్యుత్తమంగా ఉన్నట్టు తేలింది.

తెలంగాణలో గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 32 జిల్లాల్లోని 724 గ్రామాల్లో 7,240 మంది ప్రజలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు. ఈ సర్వేలో తెలంగాణ సగటున 98.62 శాతం మార్కులు సాధించింది. వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన వ్యవస్థ, చెత్త తరలించే వాహనాల ఏర్పాటు, ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరించే ఏర్పాట్లు ఉండటంతో తెలంగాణలో సర్వే జరిగిన అన్ని జిల్లాలు టాప్ 51లో చోటు దక్కించుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 100శాతం ఇళ్లకు మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు, 99.8 శాతం ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నట్టు ఈ సర్వే తేల్చింది.

క్రమం తప్పకుండా తాగునీరు అందుతోందని దేశవ్యాప్తంగాసగటున 83శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తే, తెలంగాణలో 98శాతం మంది మంచినీటి కనెక్షన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. నల్లా కనెక్షన్లతో ఆర్థిక భారం తగ్గిందని తెలంగాణలో 93శాతం మంది చెబుతున్నారు. కేవలం ఈ కారణంతో గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం మంది బాలికలు బడికి వెళ్లగలుగుతున్నారు. గతంలో వీరంతా కుటుంబ అవసరాలకోసం నీరు తెచ్చేందుకే సమయం వెచ్చించేవారు. అలా చదువుకి దూరమయ్యారు. మిషన్ భగీరథ వీరికి విద్యను కూడా అందిస్తోంది.

దేశానికే స్ఫూర్తి..

తెలంగాణ 8ఏళ్ల పసిబిడ్డ. ఇంత తక్కువ వయసులో అత్యుత్తమ పనితీరు కనబరచడం అసాధ్యమే అయినా కేసీఆర్ సారథ్యంలో అది సుసాధ్యమైంది. ఇతర రాష్ట్రాలను సైతం వెనక్కు నెట్టి తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. అభివృద్ధికి, సంక్షేమానికి డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం లేదు, టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం ఒక్కటి ఉన్నా చాలు అని నిరూపించింది.

First Published:  4 Oct 2022 1:29 AM GMT
Next Story