Telugu Global
Telangana

తెలంగాణ ఘన కీర్తి దశదిశలా చాటేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను మొత్తం 21 రోజుల పాటు నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.

తెలంగాణ ఘన కీర్తి దశదిశలా చాటేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు : సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగు పెడుతున్న చారిత్రక సందర్భంలో.. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను వైభవోపేతంగా, ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తోందని.. అందుకే ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజం ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటేలా.. ప్రతీ హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ వరకు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొలి రోజు సచివాలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని.. అదే రోజు రాష్ట్ర మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడతారని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతి పిన్న వయస్సు గల రాష్ట్రం.. అయినా కూడా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

నేడు తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపడుతున్నాయి. ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని నమోదు చేసుకున్నామని సీఎం పేర్కొన్నారు. అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడటంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని.. తెలంగాణలో అదే జరుగుతున్నదని సీఎం పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు.. వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయం, విద్యుత్తు, తాగునీరు, సాగునీరు, పల్లెలు, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఆర్థిక ప్రగతి, తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక, ఐటి అభివృద్ధి, సింగరేణి, ప్రతీ రంగంలో తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన ప్రగతి గురించి సిఎం కేసీఆర్ అధికారులకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ... రోజువారీ కార్యక్రమాల వివరాలు :

• తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను మొత్తం 21 రోజుల పాటు నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు.

• రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో జరిగే మొదటి రోజు కార్యక్రమాలను డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్‌వోడీలు హాజరవుతారు.

• అమర వీరులను స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా...మార్టియర్స్ డేగా జరుకోవాలి.

• అమరుల స్మారక దినం సందర్భంగా...రాష్ట్రవ్యాప్తంగా వున్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి విద్యుత్తు దీపాలతో వెలిగించి, తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలి.

• జాతీయ జండాను ఎగర వేసి వందన సమర్పణ చేయాలి.

• అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు.

• అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డే లో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ రోజు ఉత్సవాల్లో పాల్గొంటాయి.

• మరో ఇరవై రోజుల పాటు వరసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంటు రూపంలో ప్రదర్శించాలి.

• ఆయా శాఖలు దేశానికే అదర్శంగా సాధించిన ప్రగతిని, ఈ ప్రగతి సాధించడం వెనక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని, దార్శనికతను, దృక్పథాన్ని, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంటరీలు రూపొందించి, సినిమా హాల్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.

• స్వతంత్ర భారత దేశంలో.. తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు సాగిన.. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే.. డాక్యుమెంటరీని రూపొందించాలి.

• తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి, ప్రభుత్వ పాలన ప్రారంభమైన.. 2 జూన్ 2014 నుంచి నుంచి 2023 జూన్ 2 దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన అది సాధించిన ప్రగతిని గురించిన మరో డాక్యుమెంటరీని రూపొందించాలి.

• 21 రోజుల పాటు.. తెలంగాణ సంబురాలు నిర్వహించాలి.

• గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి జిల్లాల వ్యాప్తంగా వున్న చారిత్రక కట్టడాలను, రామప్ప సహా రాష్ట్ర వ్యాప్తంగా వున్న దేవాలయాలను సుందరీకరణ చేపట్టి విద్యుత్తు కాంతులతో అలంకరించాలి.

• హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా, పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలి.

• రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఐదారు వేల మంది కళాకారులతో హైద్రాబాద్ లో సాంస్కృతక కార్యక్రమాలు ధూం ధాం ర్యాలీ నిర్వహిస్తారు.

First Published:  14 May 2023 1:10 AM GMT
Next Story