Telugu Global
Telangana

ఫైల్స్ మాత్రమే, ఫర్నిచర్ వద్దు.. నేటినుంచి సచివాలయ తరలింపు

మధ్యాహ్నం 1.10-1.20 గంటల మధ్యలో సచివాలయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సీఎం తన ఛాంబర్ కి వెళ్తారు. సీఎం వెళ్లిన తర్వాత మంత్రులు, సీఎంవో కార్యదర్శులు తమ కార్యాలయాల్లో ఆసీనులవుతారు.

Telangana New Secretariat files and computers shifting from today
X

ఫైల్స్ మాత్రమే, ఫర్నిచర్ వద్దు.. నేటినుంచి సచివాలయ తరలింపు

తెలంగాణ కొత్త సచివాలయం ఈనెల 30న ప్రారంభమవుతుంది. అదే రోజునుంచి కార్యకలాపాలు మొదలవుతాయి. ఆమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాత సచివాలయం ఉన్న బీఆర్కే భవన్ నుంచి ఫైల్స్, కంప్యూటర్ల తరలింపు ప్రక్రియ ఈరోజునుంచి మొదలు పెడుతున్నారు.

కేవలం ఫైల్స్, కంప్యూటర్లు మాత్రమే తరలించాలని, ఎలాంటి ఫర్నిచర్ అవసరం లేదని స్పష్టం చేశారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. కొత్త సచివాలయంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఫర్నిచర్ అందుబాటులో ఉందని, అందుకే పాత ఫర్నిచర్ ని ముట్టుకోవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈనెల 29లోగా అన్ని శాఖల ఫైల్స్ తరలింపు పూర్తి కావాలని సూచించారు.

ఈనెల 30న కార్యక్రమాలు ఇలా..

ఈనెల 30న సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచే పూజలు మొదలవుతాయి. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, అధికారులు ఈ పూజల్లో పాల్గొంటారు. సచివాలయ ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 1.10-1.20 గంటల మధ్యలో సచివాలయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సీఎం తన కార్యాలయానికి వెళ్తారు. సీఎం వెళ్లిన తర్వాత మంత్రులు, సీఎంవో కార్యదర్శులు సహా ఇతర కార్యదర్శులు తమ కార్యాలయాల్లో ఆసీనులవుతారు. మే 1 నుంచి కొత్త సచివాలయంలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి.

మొదట చేయాల్సిన పనులు ఇవే..

సీఎం కేసీఆర్ అధికారికంగా సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. ఈనెల 30న మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 2.04 గంటల మధ్యలో అన్ని శాఖల అధికారులు తమ సీట్లలో కూర్చుని కనీసం ఒక ఫైల్ పై అయినా సంతకం చేయాలని సీఎంఓ సూచించింది. సంతకం చేసిన తర్వాత మధ్యాహ్నం 2.15 గంటల్లోగా సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ హాజరు కావాలి. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల మధ్యలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఉంటుంది. ఈమేరకు షెడ్యూల్ ఖరారైంది.

కేసీఆర్ సంతకం పెట్టే ఫైల్ ఏదంటే..?

సచివాలయం ప్రారంభం రోజున సీఎం కేసీఆర్ కూడా పలు కీలక ఫైళ్లపై సంతకాలు పెడతారని తెలుస్తోంది. గృహ లక్ష్మి పథకం కొనసాగింపు ఫైల్‌ తో పాటు దళిత బంధు రెండో దశ, గొర్రెల పంపిణీ పథకం, పోడు భూములకు సంబంధించిన పట్టాల ఫైల్‌ పై సీఎం కేసీఆర్ సంతకాలు చేస్తారు. సచివాలయ ప్రారంభోత్సవం రోజే, పీఆర్సీ, పింఛన్లకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడుతుందని అంటున్నారు.

First Published:  26 April 2023 3:16 AM GMT
Next Story