Telugu Global
Telangana

ఉచిత ప్రయాణాలు.. ఊహించని పరిణామాలు

ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు సర్దిచెప్పలేక తలపట్టుకుంటున్నారు.

ఉచిత ప్రయాణాలు.. ఊహించని పరిణామాలు
X

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఏ మహూర్తాన ప్రారంభించారో కానీ, రోజుకో కొత్త సమస్య పుట్టుకొస్తోంది. కర్నాటకలో కూడా ఇలాంటి పథకం అమలులో ఉన్నా ఇక్కడున్నన్ని సమస్యలు అక్కడ ఉన్నట్టు తెలియడంలేదు. తెలంగాణలో మాత్రం సీట్ల దగ్గర, టికెట్ల దగ్గర, స్టేజీల దగ్గర గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ బస్సు డ్రైవర్ అలిగి బస్సుని వదిలేసి రోడ్డుపైకి వచ్చేశాడు. చేసేదేం లేక మహిళలకు కొంతమంది బస్సు దిగిపోవడంతో తిరిగి ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. బస్సు ముందుకు కదిలింది.

ఏం జరిగిందంటే..?

నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో ఉదయం 10 గంటలకు పెద్దగట్టు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగింది. అప్పటికే ఆ బస్సు మహిళలతో కిక్కిరిసి ఉంది. కానీ పెద్ద అడిశర్ల పల్లిలో కూడా కొందరు మహిళలు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ తో గొడవపడి మరీ వారు బస్సు ఎక్కారు. దీంతో డ్రైవర్ లో సహనం నశించింది. ఇంతమందిని ఎక్కించుకుని, డోర్ దగ్గర ప్రమాదకరంగా వేలాడుతున్న మహిళలు ఉండగా తాను బస్సు నడపలేనన్నారు. బస్సు దిగి రోడ్డుపైకి వచ్చి నిలబడ్డారు. ఎంతసేపటికి బస్సు కదలకపోవడం, డ్రైవర్ బెట్టు వీడకపోవడంతో కొంతమంది మహిళలు స్వచ్ఛందంగా బస్సు దిగారు, ఆటోలో వెళ్లిపోయారు. ఆ తర్వాత బస్సు కదిలింది.

ఉచిత ప్రయాణాలతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు సర్దిచెప్పలేక తలపట్టుకుంటున్నారు. కిక్కిిరిసిన ప్రయాణికులతో ఉన్న బస్సుల్ని నడిపేందుకు డ్రైవర్లు జంకుతున్నారు. బస్సు డోర్ దగ్గర వేలాడుతున్న వారికి సర్దిచెప్పలేకపోతున్నారు. దీంతో ఇలాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి.

ఉచిత ప్రయాణాలతో హైదరాబాద్ మెట్రోకి రాబడి తగ్గింది, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు, ఆర్టీసీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఆయా సమస్యలకు ప్రత్యామ్నాయం చూపించలేక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మల్లగుల్లాలు పడుతోంది. ముందు ముందు ఈ పథకం ఇంకెన్ని కష్టాలు తీసుకొస్తుందో చూడాలి.

First Published:  18 May 2024 2:38 AM GMT
Next Story