Telugu Global
Telangana

ఆర్డినరీ బస్సులతో ఉపయోగం లేదు.. తెలంగాణ ఆర్టీసీ కొత్త నిర్ణయం

ఆర్డినరీ బస్సుల సంఖ్య పెంచినా తెలంగాణ ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం లేదు. ఆ మేర మహిళల ప్రయాణాలు ఎక్కువవుతాయి, ఒకరకంగా టికెట్ ఆదాయం పెరిగినా, ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.

ఆర్డినరీ బస్సులతో ఉపయోగం లేదు.. తెలంగాణ ఆర్టీసీ కొత్త నిర్ణయం
X

మహిళలకు ఉచిత ప్రయాణ హామీ అమలు తర్వాత తెలంగాణలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) భారీగా పెరిగింది. అయితే ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉన్న ఆర్డినరీ బస్సుల్లోనే రష్ ఎక్కువగా ఉంటోంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేషియోలో పెద్దగా మార్పులేదు. దీనిపై ఇప్పుడు ఆర్టీసీ దృష్టిసారించింది. ఆయా బస్సుల్లో కూడా ఓఆర్ పెంచుకోగలిగితే సంస్థ లాభాల బాట పట్టే అవకాశముందని తేల్చారు అధికారులు. ఆ దిశగా దృష్టిసారించారు.

కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం మార్చిలో వేతన సవరణ చేసింది. పెరిగిన వేతనాలు జూన్‌ నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ వేతన సవరణతో సంస్థపై ఏడాదికి రూ.418 కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ భారాన్ని తట్టుకునేందుకు వీలుగా టికెట్‌ ఆదాయాన్ని రోజుకు కోటి రూపాయల మేర పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏడాదికి రూ.365 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకోవాలని చూస్తోంది.

డీలక్స్, లగ్జరీ బస్సులపైనే ఆశలు..

ఆర్డినరీ బస్సుల సంఖ్య పెంచినా తెలంగాణ ఆర్టీసీకి పెద్దగా ప్రయోజనం లేదు. ఆ మేర మహిళల ప్రయాణాలు ఎక్కువవుతాయి, ఒకరకంగా టికెట్ ఆదాయం పెరిగినా, ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకే డీలక్స్, లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలని ప్రణాళిలకు సిద్ధం చేస్తోంది ఆర్టీసీ. డిమాండ్‌ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులు నడిపితే ఓఆర్ కచ్చితంగా పెరుగుతుందని అంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంలేని డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఓఆర్‌ 65-70 శాతం వరకు ఉంది. దీన్ని పెంచుకోగలిగితేనే ఆర్టీసీకి ఆదాయం కళ్లకు కనపడుతుంది. ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆగకుండా చూడటం, డిమాండ్‌ ఉన్న రూట్లలో డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్ని అధికంగా నడపడం వంటి చర్యలుచేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. రోజుకి కోటి రూపాయల అదనపు ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకుని రంగంలోకి దిగబోతున్నారు అధికారులు.

First Published:  13 April 2024 4:31 AM GMT
Next Story