Telugu Global
Telangana

రోడ్డెక్కిన కార్మికులు.. డిపోలకే పరిమితమైన బస్సులు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. డిపోలముందు బైఠాయించారు. అనంతరం రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

రోడ్డెక్కిన కార్మికులు.. డిపోలకే పరిమితమైన బస్సులు
X

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితం అయ్యాయి. ఉదయాన్నే కార్మికులంతా డ్యూటీ టైమ్ కి డిపోలకు వచ్చినా బస్సులు బయటకు రాలేదు, నిరసన ప్రదర్శనలు చేపట్టి డిపోలముందు బైఠాయించారు. అనంతరం రోడ్డెక్కి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

దేవుడు వరమిచ్చినా, పూజారి అడ్డుపడినట్టుగా ఉంది తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది పరిస్థితి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ బీఆర్ఎస్ సర్కార్ బిల్లు తీసుకొచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికే బిల్లుకి అసెంబ్లీ ఆమోదం తెలిపి ఉండేది. కానీ గవర్నర్ బిల్లుని ఆపేశారు. కొన్ని సందేహాలున్నాయంటూ గవర్నర్ తమిళిసై సీఎస్ కి లేఖ రాశారు. ఆ సందేహాలు నివృత్తి చేయాలన్నారు. నేడు అసెంబ్లీ చివరి రోజు. ఈరోజు గవర్నర్ బిల్లుని ఆమోదించి అసెంబ్లీకి పంపించకపోతే ఈ వ్యవహారం సందిగ్ధంలో పడ్డట్టే లెక్క. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. బిల్లుని వెంటనే ఆమోదించాలంటూ గవర్నర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. నగరంలోని షాద్‌ నగర్‌, ఫలక్‌ నుమ, ఫరూక్ నగర్, హకీంపేట, లింగపల్లి, కూకట్‌ పల్లి తదితర డిపోల్లో కార్మికులు నిరసన చేపట్టారు. తెలంగాణ గవర్నర్ తమ సమస్యల పట్ల వెంటనే స్పందించి ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌ భవన్‌ వద్ద కార్మికులు నిరసన చేపట్టడానికి సిద్ధమయ్యారు.

First Published:  5 Aug 2023 3:11 AM GMT
Next Story