Telugu Global
Telangana

ఊహించనంతగా తెలంగాణ రియల్ ఎస్టేట్ బూమ్.. ప్రభుత్వ చొరవతో పెరిగిన ఆదాయం

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం.. టైర్ 2 సిటీస్‌లో కూడా ఐటీ రంగం విస్తరించడంతో రియల్ బూమ్ ఏర్పడింది.

ఊహించనంతగా తెలంగాణ రియల్ ఎస్టేట్ బూమ్.. ప్రభుత్వ చొరవతో పెరిగిన ఆదాయం
X

తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎవరూ ఊహించనంతగా పెరిగిపోతోంది. హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్ధిపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ ఆకాశాన్ని అంటింది. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు సంబంధించి భారీగా లావాదేవీలు జరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ సహా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుందని భారీగా ప్రచారం చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రంగంలో కాస్త స్తబ్దత నెలకొన్న మాట వాస్తవమే. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎవరూ ఊహించనంతగా పెరిగింది.

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు రావడం.. టైర్ 2 సిటీస్‌లో కూడా ఐటీ రంగం విస్తరించడంతో రియల్ బూమ్ ఏర్పడింది. తెలంగాణ వచ్చిన కొత్తలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.2,700 కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెల సమయం ఉండగానే ఈ శాఖ రూ.12,624 కోట్ల ఆదాయాన్ని పొందింది. దీనికి తోడు ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా మరో రూ.5వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మొత్తానికి ఈ రంగంలో రూ.17,600 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వం అర్జించింది.ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి మరో రూ.2,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఎంతలా అభివృద్ధి చెందిందో తెలియజేస్తున్నాయి.

భూమికి మించిన ఆస్తి లేదని.. అందులో పెట్టుబడి పెడితే తప్పకుండా భవిష్యత్ అవసరాలకు పనికి వస్తుందని అందరూ ఆలోచిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా తమకు అందుబాటు ధరల్లో ఉన్న వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. 2019 తర్వాత తెలంగాణలో ఇలాంటి ధోరణి ఎక్కువగా పెరిగినట్లు రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు భారీగా పెరగడానికి.. మధ్య తరగతి వర్గాలు ఆసక్తి చూపించడమే అని అంటున్నారు. గత కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ల శాఖకు వస్తున్న ఆదాయం చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని చెబుతున్నారు.

2015-16లో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.3.370 కోట్ల ఆదాయం వచ్చింది. 2016-17లో రూ.3,560 కోట్లు, 2017-18లో రూ.4,571 కోట్లు, 2018-19లో రూ.6,612 కోట్లు, 2019-20లో రూ.7,061 కోట్లు, 2020-21లో రూ.5,260 కోట్లు (కరోనా కారణంగా తగ్గింది), 2021-22లో రూ.12,365 కోట్ల ఆదాయం సమకూరింది. 2014-15లో 8.26 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా.. 2021-22లో 19.88 లక్షల డాక్యుమెంట్లు నమోదయ్యాయని గణాంకాలు సూచిస్తున్నాయి. గతంలో డాక్యుమెంటేషన్ తక్కువగా ఉండేదని.. కానీ ప్రభుత్వ చొరవతో ఇప్పుడు నాలుగు రెట్ల డాక్యుమెంటు నమోదవుతున్నాయని చెబుతున్నారు.

హైదరాబాద, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల్లో రియల్ భూమ్ ఎక్కువగా ఉందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ ఏడాది రూ. 1లక్ష కోట్ల టర్నోవర్ ఈ రంగంలో ఉందని.. భారీగా డబ్బు చేతులు మారుతోందని అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇప్పడు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక దన్నుగా ఉన్నది. భూములు విలువ పెరగడంతో ప్రభుత్వం కూడా తమకు ఉన్న భూములను అమ్మి ఆర్థికంగా బలపడుతోంది. ఉప్పల్ కలాన్ ప్రాంతంలో ఉన్న భూముల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి (హెచ్ఎండీఏ) భారీగా ఆదాయం సమకూరింది. ఇదంతా రియల్ బూమ్ వల్లే సాధ్యం అయ్యిందని అధికారులు అంటున్నారు.

First Published:  23 Feb 2023 1:15 AM GMT
Next Story