Telugu Global
Telangana

నాలుగో రోజు భారీ వర్షాలు.. కృష్ణాలోనూ వరదనీరు

44వ నెంబరు హైవేపై ఉన్న బ్రిడ్జ్ ని తాకుతూ పెన్ గంగ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ప్రయాణాలు ఆగిపోయాయి.

నాలుగో రోజు భారీ వర్షాలు.. కృష్ణాలోనూ వరదనీరు
X

తెలంగాణలో గోదావరి వరద ప్రవాహం కాస్త నెమ్మదించగా కృష్ణమ్మకు పరవళ్లు మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలలోకి 30 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఎగువ జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రానికి 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి మొదటి యూనిట్ ద్వారా 40మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎగువ జూరాల నుంచి వరదనీరు దిగువ జూరాలకు చేరడంతో అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తికి అధికారులు సిద్ధమవుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకుంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు.

అటు తెలంగాణ వ్యాప్తంగా నాలుగోరోజూ భారీ వర్షాలు కురిశాయి. కుమురంభీం జిల్లా సిర్పూర్‌(యు)లో అత్యధికంగా 23.15సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మాత్రం వరుణుడు కాస్త శాంతించాడు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈరోజు రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశముంది.

శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి 1.75 క్యూసెక్కుల వరద వస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌ గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించింది. 44వ నెంబరు హైవేపై ఉన్న బ్రిడ్జ్ ని తాకుతూ పెన్ గంగ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ప్రయాణాలు ఆగిపోయాయి. జైనథ్ మండలంలో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం జలాశయానికి 69,416 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా 77,476 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

First Published:  23 July 2023 2:42 AM GMT
Next Story