Telugu Global
Telangana

తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్.. చలికాలంలో ఇదే రికార్డు

మార్చిలో తెలంగాణ అత్యధికంగా 14,160 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను చూసింది. కానీ చలికాలంలో కూడా శుక్రవారం 14,017 మెగావాట్ల డిమాండ్ ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్.. చలికాలంలో ఇదే రికార్డు
X

చలికాలం అంటే ఇంట్లో ఫ్యాన్లు అన్నీ బంద్ చేసి రగ్గులు కప్పుకొని మరీ పడుకుంటారు. కానీ ఈ సారి చలి లేకపోగా.. రాత్రి సమయంలో కూడా ఉక్క పోస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ వస్తే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా గజగజ లాడించే చలి ఉంటుంది. కానీ ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది. దీంతో ఫ్యాన్లు, ఏసీల వాడకం పెరిగిపోయింది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా చలి కాలంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో తెలంగాణ అత్యధికంగా 14,160 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను చూసింది. కానీ చలికాలంలో కూడా శుక్రవారం 14,017 మెగావాట్ల డిమాండ్ ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ఉష్ణోగ్రతలు పెరగడం, రైతులు నాట్లు వేసే పనులు మొదలు పెడుతుండటంతో ఈ సారి మార్చిలో విద్యుత్ డిమాండ్ 15,500 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా రబీ సీజన్‌లో భారీ డిమాండ్ ఉంటుందని, అందుకు తగినట్లుగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. గత ఏడాది డిసెంబర్‌లో కేవలం 10,935 మెగావాట్ల డిమాండ్ ఉన్నది. అయితే ఈ సారి డిసెంబర్‌లో ఉష్ణోగ్రత పెరగడం, గాలిలో చల్లదనం తగ్గడంతో పాటు ముందుగానే రైతులు పనులు ప్రారంభించడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. గృహ వినియోగదారులు కూడా ఫ్యాన్లు ఫుల్ స్పీడ్‌తో వాడుతున్నారని, ఏసీల వినియోగం కూడా ఈ సారి పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఒకప్పుడు చలికాలంలో అత్యధిక డిమాండ్ 8,000 మెగా వాట్ల నుంచి 9,000 మెగా వాట్ల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రైతులు విద్యుత్‌ వాడకాన్ని పెంచారు. దీంతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి. ప్రభాకర్ రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 6,600 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పుడు 14వేల మెగా వాట్లు దాటి పోయిందని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి చెప్పారు. గత ఎనిమిదేళ్లలో 119 శాతం ఎక్కువగా విద్యుత్ వాడకం పెరిగిందని అన్నారు.

గ్రేట్ హైదరాబాద్‌లో పీక్ డిమాండ్ 3,400 మెగావాట్లు ఉన్నది. ఇది 4వేల మెగావాట్ల వరకు చేరే అవకాశం ఉందని రఘుమారెడ్డి చెప్పారు. ఈ సమ్మర్‌లో ఈ అంచనాకు చేరుకుంటుందని భావిస్తున్నందున.. అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి రాష్ట్రంలో 1.71 కోట్ల కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా, రైతులు మోటార్లకు ఆటో స్టాటర్ ఉపయోగించవద్దని కోరారు. నీళ్లు, విద్యుత్ అనవసరవాడకం పెరిగి వృధా కాకుండా చూడాలని ఆయన కోరారు.

Next Story