Telugu Global
Telangana

డమ్మీ అభ్యర్థులు.. తెలంగాణలో కొత్త ఆరోపణలు

అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సహాయం చేశారని, దానికి బదులుగా లోక్ సభ ఎన్నికల్లో మోదీకి, రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

డమ్మీ అభ్యర్థులు.. తెలంగాణలో కొత్త ఆరోపణలు
X

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రులు ఎవరనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేసింది, బీజేపీ-కాంగ్రెస్ ఒకటేనని బీఆర్ఎస్ ఆరోపించింది. లోక్ సభ ఎన్నికలనాటికి ఆ ఆరోపణలు కాస్త మారాయి. కానీ ఈసారి కూడా బీజేపీని అడ్డు పెట్టుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధానికి తెరతీశాయి. లోక్ సభ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తున్నారంటూ ఇరు పార్టీలు ఆరోపించుకుంటున్నాయి.

ఎవరు డమ్మీ, ఎవరికి డమ్మీ..

అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సహాయం చేశారని, దానికి బదులుగా లోక్ సభ ఎన్నికల్లో మోదీకి, రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు గెలిచేలాగా వారిపై డమ్మీ అభ్యర్థుల్ని నిలబెడుతున్నారని అంటున్నారు. కొన్నిచోట్ల కావాలనే ఓడిపోయే అభ్యర్థుల్ని తెరపైకి తెచ్చారని ఇదంతా రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ అని విమర్శిస్తున్నారు. రేవంత్ వ్యూహమంతా బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించడానికేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సాక్షాత్తూ కేసీఆర్ కూడా ఇవే ఆరోపణలు చేయడం విశేషం.

మేము కాదు మీరే డమ్మీ..

ఇక్కడ కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇలాంటి ఆరోపణలు చేయడం విశేషం. ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పై ఇలాంటి ఆరోపణలే ఎక్కు పెట్టారు. కవిత బెయిల్ కోసం బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని, 5 స్థానాల్లో డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టిందని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ డమ్మీ ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. రెండు పార్టీలు ఒకేరకమైన ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ విశేషం.

First Published:  23 April 2024 11:39 AM GMT
Next Story