Telugu Global
Telangana

హైదరాబాద్‌లో భారీ నగదుతో పట్టుబడ్డ బీజేపీ నాయకులు.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించేందుకు యత్నం?

బీజేపీకి చెందిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌తో పాటు మరో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి నలుగురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో భారీ నగదుతో పట్టుబడ్డ బీజేపీ నాయకులు.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ప్రోత్సహించేందుకు యత్నం?
X

తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఓ భారీ సీక్రెట్ ఆపరేషన్‌లో ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ శివారు మొయినాబాద్ సమీపంలోని అజీజ్‌నగర్ ఫామ్ హౌస్‌లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి వారిని పార్టీ మారేలా ప్రోత్సహించేందుకే ఢిల్లీ నుంచి ఆ వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కీలకమైన మునుగోడు ఉపఎన్నిక మరి కొన్ని రోజుల్లో ఉండగా.. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. అక్కడ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీకి చెందిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌తో పాటు మరో వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చి నలుగురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బీరం హర్షవర్థన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డిలను బీజేపీలోకి మారాలని ఆ నలుగురు వ్యక్తులు ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దాదాపు రూ. 100 కోట్ల నగదును పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం రూ. 15 కోట్లు పట్టుకున్నట్లు చెబుతున్నారు. ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని ఢిల్లీ నుంచి వచ్చిన వారిని విచారిస్తున్నారు.

కీలకమైన మునుగోడు ఉప ఎన్నికకు మరి కొన్ని రోజులే సమయం ఉండటంతో ఈ రోజు అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలతో పార్టీ మారేలా చర్చలు జరుపుతుండటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ముందుగానే ఈ విషయం తెలుసా? లేదంటే బీజేపీ నాయకులే వారిని తప్పదోవ పట్టించి ఫామ్ హౌస్‌కు రప్పించారా అనే విషయంపై క్లారిటీ రావల్సి ఉన్నది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో పేర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌కు వలస వెళ్లిన వారే కావడం గమనార్హం.

పట్టుబడిన నందకుమార్ అనే వ్యక్తి బీజేపీ పార్టీలో కీలకంగా పని చేస్తుంటారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన సన్నిహితుడనే చర్చ జరగుతున్నది. ఆ నందకుమారే ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని, మరిన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయాలనే లక్ష్యంతోనే బీజేపీ ఇలాంటి ప్రలోభాల బాట పట్టిందనే చర్చ జరుగుతున్నది. భారీ నగదును ఆశ చూపి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగేయాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తున్నది. నందకుమార్‌తో కలిసి బేరసారాలకు దిగిన సింహయాజులు ఒక స్వామీజీ కాగా.. మిగిలిన ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉన్నది.

ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల బేరసారాల గురించి ఉప్పందుకున్న పోలీసులు అకస్మాతుగా ఫామ్ హౌస్‌పై దాడి చేశారు. దీంతో బీజేపీ చేపట్టిన బేరసారాలు బెడిసికొట్టాయి. కాగా, తాము ఓ ఫ్రెండ్ పిలిస్తే ఫామ్‌హౌస్‌కు వచ్చామని గువ్వల బాలరాజు తెలిపారు. తమకు ఎలాంటి సంబంధం లేదని కేవలం ఓ రెండు గంటల క్రితం ఇక్కడకు వచ్చామని అన్నారు. ఇంతలోనే పోలీసులు వచ్చారని... అందుకే తాము వేరే గదిలోకి వెళ్లిపోయామని చెప్పారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారు: సీపీ స్టీఫెన్ రవీంద్ర

ఫామ్ హౌస్‌కు పిలిచిన తమను ప్రలోభాలకు గురి చేస్తున్న విషయాన్ని పోలీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. పట్టుబడిన ముగ్గురు కలిసి ఎమ్మెల్యేలకు భారీగా నగదు ఆశ చూపారని, పార్టీ మారితే పదవులు కూడా ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు సీపీ చెప్పారు. తిరుపతి నుంచి ఒక స్వామీజీ వచ్చారని.. మరొకరు ఢిల్లీ నుంచి వచ్చినట్లు.. వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. స్వామీజీ మధ్యవర్తిగా వ్యవహరించారని ఆయన వెల్లడించారు. నగదుతో పాటు నలుగురి ఫోన్లు సీజ్ చేశామని.. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

First Published:  26 Oct 2022 3:50 PM GMT
Next Story