Telugu Global
Telangana

రౌడీ షీట్లే కాదు.. ఇకపై పాజిటివ్ షీట్లు కూడా

మార్పు మంచిదేనంటున్నారు తెలంగాణ పోలీసులు. నేరప్రవృత్తి విడిచిపెట్టేవారిపై పాజిటివ్ షీట్లు తెరుస్తామని, అందులో వారు చేసే మంచి పనులు కూడా రికార్డ్ చేస్తామంటున్నారు.

రౌడీ షీట్లే కాదు.. ఇకపై పాజిటివ్ షీట్లు కూడా
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి పోలీసులు మరింత స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారాల్లో మరింత కఠినంగా ఉంటామనే సందేశం పంపించారు. అదే సమయంలో రౌడీల్లో పరివర్తన తెచ్చేందుకు కూడా తాము కృషి చేస్తామని, వారిలో మార్పు తెచ్చేందుకు తాము సహకరిస్తామని చెబుతున్నారు కూడా. ఈ క్రమంలో రౌడీషీట్లు తెరవడంతోపాటు పాజిటివ్ షీట్లు కూడా వారికోసం ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు రాచకొండ పోలీసులు. ఈ పాజిటివ్ షీట్లలో నమోదైన మంచి పనులను బట్టి.. వారిపై రౌడీషీట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.

సహజంగా రౌడీ షీట్ తెరిచిన తర్వాత చాలామంది ఆ నేరప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. ఎలాగూ పోలీస్ రికార్డుల్లో రౌడీగా ముద్రపడిపోయాం కాబట్టి.. ఇక మంచివారిగా ఉన్నా ఎవరూ నమ్మరు అనేది వారి లాజిక్. అయితే మార్పు మంచిదేనంటున్నారు పోలీసులు. నేరప్రవృత్తి విడిచిపెట్టేవారిపై పాజిటివ్ షీట్లు తెరుస్తామని, అందులో వారు చేసే మంచి పనులు కూడా రికార్డ్ చేస్తామంటున్నారు. మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్‌ ను తొలగిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. మార్పు కోసం ప్రయత్నించే రౌడీలకు సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. 100 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని మంచిగా మారాలని సూచించారు.

తొందరపాటులో నేరాలు చేసి నా సరే.. తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు రాచకొండ పోలీసులు. డాక్టర్‌ పిల్లలు డాక్టర్లు, పోలీస్‌ ఆఫీసర్ల పిల్లలు పోలీసులు అవుతున్నారని.. రౌడీ షీటర్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఇదో మంచి అవకాశమని అన్నారు. డిసెంబర్‌ 31 అంటే రౌడీ మార్పు దినోత్సవంగా గుర్తిండిపోవాలని చెప్పారు. అయితే రౌడీషీట్‌ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు.

First Published:  1 Jan 2024 12:53 AM GMT
Next Story