Telugu Global
Telangana

మేడారం జాతరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు?. జాతరకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి?. అని తెలుసుకునేందుకు క్రౌడ్‌ కౌంటింగ్‌ కెమెరాలు అమర్చబోతున్నారు.

మేడారం జాతరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
X

మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టైమ్‌ వేస్ట్‌ కాకుండా టెక్నాలజీని వాడి మెరుగైన సేవలందించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు.

ట్రాఫిక్ నియంత్రణ

జాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు అధికారులు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కెమెరాల్లో ఇన్‌స్టాలేషన్‌ చేసి అమర్చుతారు. వాటిని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేస్తారు. చదరపు మీటరులో నలుగురు కంటే ఎక్కువగా ఉంటే కంట్రోల్‌రూమ్‌కు సమాచారం వెళ్తుంది. వెంటనే కంట్రోల్‌ రూమ్‌ నుంచి సిబ్బందిని అప్రమత్తం చేసి అక్కడ రద్దీని నియంత్రిస్తారు.

ఎంతమంది భక్తులు, వాహనాలు ఎన్ని?

ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు?. జాతరకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి?. అని తెలుసుకునేందుకు క్రౌడ్‌ కౌంటింగ్‌ కెమెరాలు అమర్చబోతున్నారు. వాహనాల కోసం ప్రత్యేకంగా అటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో వీటిని అమర్చుతారు.

500 సీసీ కెమెరాలు- కమాండ్ కంట్రోల్ రూమ్

మేడారం జాతర పరిసరాలతో పాటు ముఖ్యమైన రూట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ములుగు పట్టణ శివారు గట్టమ్మ ఆలయం నుంచి పస్రా మీదుగా మేడారం వరకు ఈ సీసీ కెమెరాలుంటాయి. అమ్మవార్ల గద్దెలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలు, పార్కింగ్‌ స్థలాల్లో మొత్తం 500 సీసీ కెమెరాలు పెట్టారు. 24 గంటలు పర్యవేక్షించేందుకు మేడారంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జాతర పరిసరాల్లో ఎక్కడ ఏం జరిగినా కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న పోలీసులకు తెలిసిపోతుంది. ట్రాఫిక్ సమ‌స్య‌, దొంగతనాలు, ఘర్షణలు, ప్రమాదాలు ఏం జరిగినా వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు.

డ్రోన్లు, ఎల్‌ఈడీలు..

జాతర పరిస్థితులను అంచనా వేసేందుకు డ్రోన్‌ కెమెరాలను వాడుతున్నారు. ఇప్పటికే 5 డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. జాతర సమయానికి వీటి సంఖ్యను మరింత పెంచుతారు. మేడారం జాతర వివరాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే జాతర సమయంలో విపరీతమైన రద్దీతో చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోతుంటారు. అలా తప్పిపోయిన వారి ఫొటోలను స్క్రీన్లపై ప్రసారం చేస్తారు.

6వేల స్పెషల్ బస్సులు

జాతర కోసం ఆర్టీసీ 6వేల స్పెషల్‌ బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ కోసం మేడారంలో 70 ఎకరాల్లో ప్రత్యేక ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులకోసం 33 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. 1400 ఎకరాల్లో పార్కింగ్‌ ఉండబోతోంది. ఈసారి దాదాపు 5 లక్షల వాహనాలు వస్తాయని అంచనా.

ప్రత్యేక యాప్‌

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం త్వరలోనే ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు. జాతరకు సంబంధించిన వివరాలు, పార్కింగ్‌ స్థలాలు, టాయిలెట్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, స్నానఘట్టాలు, ఆర్టీసీ బస్టాండు, వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడికి ఎలా చేరుకోవాలి? రూట్ వివరాలు, హెల్ప్‌లైన్‌, ట్రాఫిక్‌.. ఇలా సమాచారమంతా అందులో ఉంటుంది. త్వరలోనే ఈ యాప్‌ను రిలీజ్‌ చేయనున్నారు.

First Published:  12 Feb 2024 5:18 AM GMT
Next Story