Telugu Global
Telangana

మణిపూర్ లో తెలుగువారిని రక్షించేందుకు తెలంగాణ పోలీసుల ముందడుగు

మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులు, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించింది. ప్రత్యేక విమానాన్ని ఇంఫాల్ కు పంపిస్తోంది.

మణిపూర్ లో తెలుగువారిని రక్షించేందుకు తెలంగాణ పోలీసుల ముందడుగు
X

మణిపూర్ హింస ఇంకా చల్లారలేదు. 31మంది మరణించారని వార్తలొస్తున్నా.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువేననే అనుమానాలున్నాయి. ఈ క్రమంలో మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం తెలంగాణ పోలీసులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అత్యవసర హెల్ప్‌లైన్‌ నెంబర్ ని కేటాయించారు. మణిపూర్ లో చిక్కుకున్న తెలుగువారు, లేదా వారికి సంబంధించి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారెవరైనా ఈ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు. +91 79016 43283 హెల్ప్‌ లైన్ నెంబర్‌ కి కాల్ చేసి తమ వివరాలు తెలియజేస్తే.. మణిపూర్ లో వారికి సహాయం అందిస్తామని చెబుతున్నారు తెలంగాణ పోలీసులు. 24 గంటలు ఈ హెల్ప్ లైన్ నెంబర్ ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఇంకా ఏవైనా సందేహాలుంటే dgp@tspolice.gov.inకి ఈమెయిల్ చేయాలన్నారు.

స్పెషల్ ఫ్లైట్..

మణిపూర్ లో చిక్కుకున్న విద్యార్థులు, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించింది. ప్రత్యేక విమానాన్ని ఇంఫాల్ కు పంపిస్తోంది. ఆదివారం ఉదయం ఈ స్పెషల్ ఫ్లైట్ ఇంఫాల్ నుంచి బయలుదేరుతుందని తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు. ఇతర వివరాలకు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలని సూచించారు.



మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు తెలంగాణ పోలీసులు ముందడుగు వేశారు. స్థానిక పోలీసుల సహకారంతో తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తామంటున్నారు. బాధితులు తమను సంప్రదిస్తే వారికి రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు. హెల్ప్ లైన్ నెంబర్ ని వినియోగించుకోవాలని సూచించారు.

గిరిజనులకు, కొత్తగా ఎస్టీ రిజర్వేషన్లు పొందబోతున్న మైతై వర్గానికి మధ్య జరుగుతున్న గొడవల్లో సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. భారీగా ఆస్తినష్టం జరుగుతోంది. పోలీసులు ఆందోళనలను అరికట్టలేకపోతున్నారు. సైన్యం రంగంలోకి దిగినా ఫలితం కనిపించడంలేదు. రాజకీయ లాభం కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మణిపూర్ ని మంటల్లోకి నెట్టింది. స్థానికులే కాదు, వివిధ కారణాలతో మణిపూర్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా దిక్కుతోచని స్థితిలో అక్కడే బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

First Published:  6 May 2023 3:38 PM GMT
Next Story