Telugu Global
Telangana

సాహితీ కృషీవలునికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు

తెలంగాణ కవి వేణు సంకోజుకు ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డు వచ్చింది. దాశరథి జయంతి సందర్భంగా ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం సాహితీకారులకు ఈ అవార్డునిచ్చి సత్కరిస్తోంది. ఈ పురస్కారాన్ని వేణు సంకోజుకు శుక్రవారం హైదరాబాద్ లో ప్రదానం చేస్తున్నారు.

సాహితీ కృషీవలునికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు
X

'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యను నేటికీ తెలంగాణ స్మరించుకుంటూనే ఉంది. ఆ కవిది అద్భుత పద వల్లికల ప్రయోగం ! తెలంగాణ కేవలం ఒక రత్నమే కాదు.. ఇది కోటి రతనాలతో కూర్చిన వీణ అన్న ఆయన భావన ఈ నాటికీ అనేకమంది తెలంగాణ కవులకు, రచయితలకు స్ఫూర్తినిస్తోంది. దాశరథీ కరుణా పయోనిధీ అన్న పద్యంలోని 'దాశరథి' పద దార్శనికత కృష్ణమాచార్య కవితకు వన్నెలు దిద్దితే.. నేటి కవులు సైతం ఆ అద్భుత పద ప్రయోగాలను పుణికిపుచ్చుకున్నారు. వారిలో ఒకరే డాక్టర్ వేణు సంకోజు. నల్గొండకు చెందిన ఈయనను ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది. కృష్ణామాచార్య జయంతి సందర్భంగా ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వం సాహితీ కృషీవలులకు ఈ అవార్డునిచ్చి సత్కరిస్తోంది. ఈ పురస్కారాన్ని వేణు సంకోజుకు శుక్రవారం హైదరాబాద్ లో ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు కింద లక్షా వెయ్యిన్నూట పదహార్ల నగదుతో బాటు జ్ఞాపికను కూడా ఆయనకు బహుకరించనున్నారు. కవిత్వమే తన సాహితీ నందవనంగా భావిస్తూ తన కలానికి పదును పెడుతున్న వేణు సంకోజు 1972 లో ఈ వనంలో ప్రవేశించారు. 1984 లో 'జయమిత్ర' పేరిట సాహిత్య సాంస్కృతిక వేదికను స్థాపించి.. సాంస్కృతిక రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. 1995 లో 'మనిషిగా పూచే మట్టి' అనే కవితా సంపుటిని ప్రచురించగా.. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు దాన్ని ఆవిష్కరించారు. 'మనం', 'నేలకల', 'ప్రాణప్రదమైన' వంటి కవితా సంపుటాలు ఆయన లోని భావనలను ఆవిష్కరించాయి. 'స్పర్శ' శీర్షికన కథా సంలనాన్ని కూడా ప్రచురించిన వేణు.. 'వీర తెలంగాణ' మాస పత్రికకు ఎడిటర్ గా వ్యవహరించారు. తెలంగాణ, తొలి, మలి ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. సుమారు 5 దశాబ్దాలుగా సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ కవికి లోగడ కాళోజీ అవార్డు, తెలుగు యూనివర్సిటీ సాహిత్య పురస్కారం లభించాయి.

2001 లో తెలంగాణ రైటర్స్ ఫోరంను ఏర్పాటు చేసి 2007 వరకు ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా వేణు వ్యవహరించారు. 2005 లో ఇంటర్మీడియట్ సివిక్స్ కరిక్యులంలో మెంబర్ గా ఉన్నారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర వహించిన సుద్దాల హనుమంతు మోనోగ్రాఫ్ రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. నాడు తెలుగు అకాడమీ 102 పేజీలతో ఈ మోనోగ్రాఫ్ ని రూపొందించింది. దాశరథి కృష్ణమాచార్య అవార్డును అందుకుంటున్న సందర్భంగా వేణు సంకోజును విద్యావేత్త గోనారెడ్డితో బాటు అనేకమంది కవులు, రచయితలు అభినందించారు. వేణు సంకోజు వంటి కవులు, రచయితలు సాహితీ రంగంలో చేస్తున్న సేవలకు గాను

వారిని ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రముఖ కవుల పేరిట ఏర్పాటు చేసిన అవార్డులను వారికి ప్రదానం చేస్తున్న తెలంగాణ.. నిజంగా కోటి రతనాల వీణ అనడంలో అతిశయోక్తి లేదు. బలమైన భావ కవితా పటిమకు ఎప్పుడూ, ఏనాడూ ఆదరణ, గుర్తింపు ఉంటాయి మరి !

First Published:  27 July 2022 1:30 AM GMT
Next Story