Telugu Global
Telangana

తెలంగాణలో పెద్ద ఎత్తున కూరగాయల సాగు కోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

తెలంగాణలో పెద్ద ఎత్తున కూరగాయల సాగు కోసం  భారీ ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం
X

ప్రతి రోజు హైదరాబాద్ నగరానికి వచ్చే కూరగాయలు ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి వంటి పరిసర ప్రాంతాల నుండి వస్తాయి. అయితే డిమాండ్ సప్లై లో 50 శాతం అంతరం ఉండటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ అంతరాన్ని తగ్గించడానికి, మరింతగా కూరగాయల సాగును పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్దం చేసింది.

రంగారెడ్డిలో ఏటా 28 వేల ఎకరాల్లో 34 వేల మెట్రిక్ టన్నుల కూరగాయల పంటలు సాగవుతుండగా, వికారాబాద్ లో 20 వేల ఎకరాల్లో ఏటా 25 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. సంగారెడ్డిలో 12 వేల ఎకరాల్లో 13 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు సాగు చేస్తున్నారు.

ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డిలో 74,000 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతుంది. అయితే హైదరాబాద్ అవసరాలు తీరాలంటే 1.51 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేయాల్సి ఉంది.

కూరగాయల పంటల ఉత్పత్తిని పెంచేందుకు ఉద్యానవన శాఖ జీడిమెట్ల, ములుగు ప్రాంతాల్లోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు చర్యలు తీసుకుంటోంది. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంలో రైతులకు సహాయం చేస్తున్నది. రైతులకు 5,000 నుండి 10,000 నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తోంది.

రంగారెడ్డిలో యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లో అత్యధికంగా కూరగాయలు సాగవుతున్నాయి. అలాగే ప్రస్తుతం రంగారెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అదేవిధంగా 30 వేల ఎకరాల్లో పూలు సాగు కావాల్సి ఉండగా 10 వేల ఎకరాల్లో సాగవుతోంది.

First Published:  9 April 2023 5:01 AM GMT
Next Story