Telugu Global
Telangana

గ్యారెంటీల గందరగోళం.. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరిన జనం

500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ రావాలంటే కేవైసీ తప్పనిసరి అనే ప్రచారం వైరల్‌ గా మారింది. దీంతో వినియోగదారులు కేవైసీ చేయించుకునేందుకు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు.

గ్యారెంటీల గందరగోళం.. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరిన జనం
X

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శాంపిల్ గా రెండు గ్యారెంటీలను పట్టాలెక్కించింది. మిగతా వాటికి 100 రోజుల డెడ్ లైన్ పెట్టింది. అంటే మూడు నెలలపాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమ్ దొరికినట్టే లెక్క. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినా.. తమకు తామే ఇప్పుడు 3 నెలలు వెసులుబాటు ఇచ్చుకున్నారు నాయకులు. అయితే అంతవరకు జనం ఆగేలా లేరు, గ్యారెంటీల విషయంలో కంగారు పడిపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరిన జనమే దీనికి ఉదాహరణ.

500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పేర్కొంది కాంగ్రెస్. అయితే ఈ పథకం సాధ్యాసాధ్యాలను ఇప్పుడు నాయకులు అధ్యయనం చేస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, సిలిండర్ల సంఖ్యపై పరిమితి విధించాలా లేదా.. అనే విషయాలు ఆలోచిస్తున్నారు. ఇంతలో కేవైసీ చేయించుకోవడం అనే ప్రక్రియ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవైసీ చేయించుకున్నవారికే గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై ఇస్తారనే ప్రచారం జరగడంతో జనం గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు.

500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ రావాలంటే కేవైసీ తప్పనిసరి అనే ప్రచారం వైరల్‌ గా మారింది. దీంతో వినియోగదారులు కేవైసీ చేయించుకునేందుకు గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, కేవైసీ కోసం చివరి తేదీ అంటూ ఏమీ లేదని చెబుతున్నారు. కానీ జనం మాత్రం కేవైసీ కోసం రోజువారీ పనులు ఆపేసుకుని మరీ ఏజెన్సీల ముందు నిలబడుతున్నారు.

గ్యారెంటీ కార్డుల పేరుతో మరో దందా..

ఇక గ్యారెంటీ కార్డుల పేరుతో కొన్నిచోట్ల జిరాక్స్ సెంటర్లు దందా మొదలు పెట్టాయి. గ్యారెంటీ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయని చెబుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై లబ్ధిదారుల ఫొటోలు ప్రింట్ చేసి లామినేషన్ చేసి అందిస్తున్నారు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు. ఒక్కొకరి వద్ద 50రూపాయలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద గ్యారెంటీలపై అధికారిక సమాచారం బయటకు వచ్చేలోపు పుకార్లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. జనం గందరగోళంలో పడిపోతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అధికారిక సమాచారం విడుదల చేస్తేనే ఈ గందరగోళం ఆగుతుంది.

First Published:  13 Dec 2023 6:47 AM GMT
Next Story