Telugu Global
Telangana

పీసీసీ పీఠం.. కాంగ్రెస్ లో ముసలం

సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తాను, డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు, అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ లో ఎస్సీ నేతలు ఉన్నారు కాబట్టి పీసీసీ పీఠం బీసీలకు ఇవ్వడం సముచితం అనేది రేవంత్ రెడ్డి వాదన.

పీసీసీ పీఠం.. కాంగ్రెస్ లో ముసలం
X

తెలంగాణలో పీసీసీ పీఠం కాంగ్రెస్ లో ముసలానికి కారణం అయ్యేలా ఉంది. గతంలో సీఎం సీటుకి కూడా ఈ స్థాయిలో పోటీ లేదు, రేవంత్ రెడ్డి కష్టానికి అధిష్టానం గుర్తింపు ఇచ్చింది. కానీ ఈసారి పీసీసీ పీఠం విషయంలో మాత్రం సీనియర్ నేతలు ఎవరికి వారే పోటీదారులుగా మారారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. మధుయాష్కీతోపాటు మరికొన్ని పేర్లు వినపడుతున్నా కూడా వారంతా తుది దశ పోటీలో ఉండరని తెలుస్తోంది.

కర్నాటకలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సీఎం పదవి సిద్ధరామయ్యకు ఇచ్చి, డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ కు పీసీసీ పీఠం వదిలిపెట్టింది అధిష్టానం. తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సీఎం పదవిపై ఆశలు ఉన్నా.. డిప్యూటీ సీఎం పోస్ట్ తో సరిపెట్టుకున్న మల్లు భట్టి విక్రమార్క ఇప్పుడు పీసీసీ విషయంలో మాత్రం తగ్గేది లేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పులుంటాయని అనుకున్నా, అధిష్టానం మాత్రం లోక్ సభ ఎన్నికల వరకు పోస్ట్ పోన్ చేసింది. దీంతో ఇప్పుడు భట్టి తన లాబీయింగ్ ముమ్మరం చేశారు.

రేవంత్ ఆశీస్సులతో..

సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ పీఠం ఇప్పించాలనుకుంటున్నారు. సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తాను, డిప్యూటీ సీఎం పోస్ట్ తో పాటు, అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ లో ఎస్సీ నేతలు ఉన్నారు కాబట్టి పీసీసీ పీఠం బీసీలకు ఇవ్వడం సముచితం అనేది రేవంత్ రెడ్డి వాదన. అందుకే ఆయన మహేష్ కుమార్ గౌడ్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరి మాట వింటుందో చూడాలి. సీఎం సీటు విషయంలో సర్దుకుపోయిన భట్టికి కనీసం పీసీసీ పీఠం ఇచ్చి సరిపెడతారేమో చూడాలి. లేదా సీఎంకు అనుకూలంగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ పీఠం అప్పగించి పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండేలా చూస్తారేమో తేలాల్సి ఉంది.

First Published:  17 May 2024 6:27 AM GMT
Next Story