Telugu Global
Telangana

అమ్ముడుపోయిన పెద్ద‌ రెడ్లు ఎవరబ్బా?

పాదయాత్రలో భాగంగా నిజామాబాద్‌లో రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొందరు పెద్ద‌ రెడ్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయినట్లు చెప్పారు. పెద్ద‌ రెడ్లు అమ్ముడుపోయిన కారణంగానే యువతరానికి అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు.

అమ్ముడుపోయిన పెద్ద‌ రెడ్లు ఎవరబ్బా?
X

తెలంగాణ పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో భాగంగా నిజామాబాద్‌లో రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కొందరు పెద్ద‌ రెడ్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయినట్లు చెప్పారు. పెద్ద‌ రెడ్లు అమ్ముడుపోయిన కారణంగానే యువతరానికి అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. యువతరానికి పెద్దపీట వేయటంలో భాగంగానే తాను పీసీసీ ప్రెసిడెంట్ అయినట్లు చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీకి 34 శాతం ఓట్లున్నాయట.

ఈ 34 శాతానికి మరో 5 శాతం ఓట్లను జోడించటానికే కష్టపడుతున్నట్లు కూడా చెప్పారు. పార్టీ ఇప్పుడు రెండో స్థానంలో ఉందన్నారు. 5 శాతం ఓట్ల కోసం రేవంత్ కష్టపడటం ఏమిటో కానీ ఉన్నవిపోకుండా చూసుకుంటే అదే పదివేలన్నట్లుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే కేసీఆర్‌కు పెద్ద‌ రెడ్లు అమ్ముడుపోయారనే వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. ఇంతకీ కేసీఆర్‌కు అమ్ముడుపోయిన పెద్ద‌ రెడ్లు ఎవరో తేల్చి చెప్పాల్సిన బాధ్యత కూడా రేవంత్‌పైనే ఉంది.

రేవంత్ అంటే పడని సీనియర్ నేతలు చాలామందే ఉన్నారు. తన వ్యాఖ్యలు తేనె తుట్టెను కదపటమే అన్న విషయం రేవంత్‌కు బాగా తెలుసు. అయినా అమ్ముడుపోయారనేంత పెద్ద ఆరోపణ చేశారంటే సీనియర్లను కావాలని రెచ్చగొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు అర్థ‌మైపోతోంది. గతంలో ఒకసారి పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఆ ఆరోపణలపై ఎందుకనో దుమారం రేగలేదు.

అప్పటి నుండి రేవంత్‌పై ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తునే ఉంది. అసలే దూకుడుస్వభావం ఉన్న రేవంత్ నోటికి బాగా పనిచెబుతున్నారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాగ సీనియర్లను ఏదో ఒక విధంగా ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థంకావటంలేదు. అసలు రేవంత్ మీదే చంద్రబాబునాయుడు ప్రతినిధి అనే ముద్రుంది. చంద్రబాబు కారణంగానే రేవంత్‌కు పీసీసీ పగ్గాలు దక్కాయని కొందరు సీనియర్లు బహిరంగంగానే కామెంట్లు చేస్తుంటారు. అవి సరిపోవన్నట్లుగా ఇప్పుడు కేసీఆర్‌కు పెద్ద రెడ్లు అమ్ముడుపోయారనే కామెంట్ చాలా హాట్ హాట్‌గా మారింది. మరీ తాజా ఆరోపణలు పార్టీలో ఎంతటి దుమారం రేపుతాయో చూడాల్సిందే.

Next Story