Telugu Global
Telangana

తెలంగాణ మున్సిపల్ శాఖ దశాబ్ది నివేదిక విడుదల.. జవాబుదారితనం లక్ష్యంగా పురపాలన

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు సమగ్రంగా, సమతుల్యంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ మున్సిపల్ శాఖ దశాబ్ది నివేదిక విడుదల.. జవాబుదారితనం లక్ష్యంగా పురపాలన
X

తెలంగాణలో 9 ఏళ్లుగా జరిగిన పట్టణ ప్రగతిని, ప్రస్తుత ఏడాదిలో చేపట్టనున్న కార్యక్రమాలను సవివరంగా వివరించే నివేదికను మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఏర్పాటును గుర్తు చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా పురపాలక శాఖ సాధించిన విజయాలు, భవిష్యత్‌లో పెట్టుకున్న లక్ష్యాలతో కూడిన నివేదికను ఆవిష్కరిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పురపాలక శాఖ పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యంగా ఈ నివేదిక విడుదల చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రతీ ఏడాది పురపాలక శాఖకు సంబంధించిన నివేదిక విడుదల చేస్తున్నాము. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాము. ఈ నేపథ్యంలో 9 ఏళ్ల పట్టణ ప్రగతి అందరికీ వివరించాలనే ఈ నివేదిక రూపొందించాము. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు సమగ్రంగా, సమతుల్యంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్లలో మున్సిపల్ శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేశాము. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇది 462 శాతం ఎక్కువని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలోని ప్రతీ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకొని పోతున్నది. మన రాష్ట్రంలోని 26 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పథకంలో మన పురపాలకాలు ఎన్నో అవార్డులు గెలుచుకున్నాయని చెప్పారు. పట్టణాలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో, సుస్థిరమైన స్థానిక ప్రభుత్వాలు ఉండాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ పురపాలక శాఖ చేసిన ఖర్చులో 92 శాతం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. మిగిలిన 8 శాతం రాజ్యాంగబద్దంగా మనకు రావల్సిన నిధులను కేంద్ర విడుదల చేసింది. అంతే తప్ప.. కేంద్రంలోని బీజేపీ సర్కారు రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని చెప్పారు. ఏ రంగంలో తీసుకున్నా గతంలో కంటే ఎక్కువగానే ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది. తొమ్మిదేళ్లలోనే గణనీయమైన, గుణాత్మకమైన తేడా కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలో హైదరాబాద్ నగరం చాలా కీలకం. తొమ్మిదేళ్లలో మున్సిపల్ శాఖ సింహభాగం హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టింది. అందుకు ఒక కారణం కూడా ఉందని మంత్రి చెప్పారు. తెలంగాణ జనాభా 4 కోట్ల లోపు ఉంటే.. హైదరాబాద్‌లోనే 1.2 కోట్ల మంది నివసిస్తున్నారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం హైదరాబాద్‌లో ఎక్కువగా ఖర్చు పెట్టామన్నారు. నగర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా 35 ఫ్లైవోవర్లు నిర్మించాము. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే.. నేషనల్ హైవే సంస్థ మాత్రం ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైవోవర్లను పూర్తి చేయలేకపోతుంద‌ని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్ నగరంలో రోడ్ల నాణ్యత పెరిగింది. ఇప్పుడు వాహనదారులు తక్కువ సమయంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని మంత్రి చెప్పారు. వరద ఇబ్బందులు తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నాము. నగరంలోని 150 కాలనీలు గతంలో ముంపు వల్ల ఇబ్బంది పడేవి. ఎస్ఎన్‌డీపీ వల్ల ఇప్పుడు ఈ ముంపు బాధ తప్పిందని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్ నగరంతో పాటు చుట్టు పక్కల ఉన్న మున్సిపాలిటీల్లో కూడా రూ.238 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటి వరకు 19 కార్యక్రమాలను ప్రారంభించగా.. వాటిలో ఏడు పూర్తయ్యాయని.. మిగిలిన 12 పనులు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలో 2050 నాటికి తాగు నీటి సమస్యే లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓఆర్ఆర్ పరిధిలో కూడా నీళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11.5 లక్షల కుటుంబాలకు ఉచితంగా మంచి నీరు అందిస్తున్నాము. దీని ద్వారా రూ.870 కోట్ల ప్రయోజనం చేకూరిందని మంత్రి చెప్పారు. 100 శాతం ఎస్టీపీలు ఉన్న నగరంగా హైదరాబాద్‌ దేశంలోనే రికార్డు సృష్టించబోతోంది. సెప్టెంబ‌ర్ నాటికి అన్ని ఎస్టీపీల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తున్నాము. అన్ని పట్టణాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాము. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్లు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు.


First Published:  5 July 2023 10:04 AM GMT
Next Story