Telugu Global
Telangana

15 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశావ్.. అంబర్ పేటకు ఏం తెచ్చావ్..?

ఎమ్మెల్యేగా ఓడించినందుకు అంబర్ పేట ప్రజలకు కిషన్ రెడ్డి జీవితాంతం రుణపడి ఉండాలని ఎద్దేవా చేశారు మంత్రి తలసాని. 2018 ఎన్నికల్లో అంబర్ పేట ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి గెలిచి ఉంటే.. ఆయన కేంద్ర మంత్రి అయిఉండేవారు కాదన్నారు.

15 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశావ్.. అంబర్ పేటకు ఏం తెచ్చావ్..?
X

ప్రధాని నరేంద్రమోదీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు మరింత రెచ్చిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు కట్టిపెట్టి ఢిల్లీ నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు. మతాలు, కులాల పేరుతో బీజేపీ నేతలు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

15ఏళ్లలో ఏం చేశావ్..?

కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గానికి 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేశాడని, ఆయన హయాంలో అసలు అంబర్ పేటకు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు తలసాని. పోనీ కేంద్రంలో మంత్రిగా పెత్తనం చలాయిస్తున్న ఈ సమయంలో అయినా సొంత నియోజకవర్గానికి ఏమైనా చేశారా, నిధులు తెచ్చారా అంటూ నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ నేతలకు తలసాని సవాల్ విసిరారు.

అక్కడ ఓడిపోయినందుకే..

ఎమ్మెల్యేగా ఓడించినందుకు అంబర్ పేట ప్రజలకు కిషన్ రెడ్డి జీవితాంతం రుణపడి ఉండాలని ఎద్దేవా చేశారు మంత్రి తలసాని. అక్కడ ఓడిపోయినందుకే ఆ తర్వాత ఎంపీగా గెలిచి, ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా కిషన్ రెడ్డి పని చేస్తున్నారని గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో అంబర్ పేట ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి గెలిచి ఉంటే.. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రి అయిఉండేవారు కాదన్నారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డివిజన్ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి తలసాని, కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కేసీఆర్‌ ను ఢీ కొట్టగల నాయకుడు లేరని అన్నారు.

First Published:  9 April 2023 11:12 AM GMT
Next Story