Telugu Global
Telangana

చరఖా తిప్పితే చేసిన పాపం పోతుందా..?

ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ చరఖా తిప్పుతూ తనకి తాను దీన జనోద్ధారకుడిలాగా ఫోజులివ్వడంతో కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. చేసే పనులకు, పన్నులరూపంలో పెట్టే వాతలకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు.

చరఖా తిప్పితే చేసిన పాపం పోతుందా..?
X

అహ్మదాబాద్ లో జరిగిన ఖాదీ ఉత్సవ్ లో ప్రధాని నరేంద్రమోదీ చరఖా తిప్పారు. శనివారం సాయంత్రం నుంచి ఆయన చరఖా తిప్పిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, పనిగట్టుకుని బీజేపీ నేతలు వైరల్ చేశారనే చెప్పాలి. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ వీడియోని పోస్ట్ చేస్తూ 'ఆత్మ నిర్భర్ తా కా సూత్ర్' అంటూ కామెంట్ పెట్టారు. ఇక చూస్కోండి సోషల్ మీడియాలో కామెంట్లు అదిరిపోయాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ చరఖా విన్యాసంపై విరుచుకుపడ్డారు.

ఏ మొహం పెట్టుకుని...

ఖాదీ, చేనేతపై జీఎస్టీ బాదేసిన ప్రధాని నరేంద్రమోదీ ఏ మొహం పెట్టుకుని చరఖా తిప్పి, ప్రచారం చేసుకుంటారని మండిపడ్డారు కేటీఆర్. చెప్పే మాటలకి, చేసే పనులకి ఎంత తేడా ఉందంటూ ధ్వజమెత్తారు. కనీసం ఇది మీకైనా తప్పుగా అనిపించలేదా అని పీయూష్ గోయల్ కి బదులిస్తూ రీట్వీట్ చేశారు కేటీఆర్. చేనేత వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలంటూ టీఆర్ఎస్ తరపున పోరాటం జరుగుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా చేనేత పరిశ్రమ జీఎస్టీ వల్ల నష్టపోతోందనే విషయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు కేటీఆర్. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ చరఖా తిప్పుతూ తనకి తాను దీన జనోద్ధారకుడిలాగా ఫోజులివ్వడంతో కేటీఆర్ మరోసారి ఫైరయ్యారు. చేసే పనులకు, పన్నులరూపంలో పెట్టే వాతలకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు.

వారణాసిలో 50మంది చేనేత కార్మికుల ఆత్మహత్య..

ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో చేనేతలు కూలీలు గిట్టుబాటు కాక, చేసే పనికి సరైన వేతనం లేక, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత వారణాసిలో 50మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జీఎస్టీతో చేనేతల బతుకు చిత్రం మరింత దారుణంగా తయారైందనే ఆరోపణలున్నాయి. వారణాసి చేనేత కార్మికుల ఆత్మహత్యలపై వచ్చిన ఓ న్యూస్ ఆర్టికల్ ని కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు.

First Published:  28 Aug 2022 2:40 AM GMT
Next Story