Telugu Global
Telangana

ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా సరే.. 2022 కల్లా ఇస్తానన్న ఇళ్లేవి మోడీజీ : కేటీఆర్

అంతే కాకుండా గతంలో మోడీ ఇలాంటి వాగ్దానాలు గుప్పిస్తూ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు. 2018కి సంబంధించిన ఆ వీడియోలో మోడీ ఎన్నో ప్రకటనలు గుప్పించారు. తాము 2022 కల్లా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.

ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా సరే.. 2022 కల్లా ఇస్తానన్న ఇళ్లేవి మోడీజీ : కేటీఆర్
X

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృతోత్సవ్' పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నెల 2 నుంచి 15 వరకు సోషల్ మీడియాలో డీపీలను మువ్వన్నెల రంగులోకి మార్చాలని ప్రధాని మోడీ కోరారు. అలాగే ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. 'హర్ ఘర్ తిరంగా' అంటూ మోడీ తన నినాదాన్ని ఇటీవల తన 'మన్ కీ బాత్' మరోసారి గుర్తు చేశారు.

కాగా, గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 'ప్రియమైన ప్రధాని నరేంద్ర మోడీ గారూ హర్ ఘర్ తిరంగా మంచిగానే ఉంది. కానీ 2022 కల్లా ప్రతీ ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన వాగ్దానం పరిస్థితి ఏమైంది మోడీ గారూ. ఇది కూడా జుమ్లానా (ఫేక్ ప్రామిస్)' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దానికి #KyaHuaTeraWaada అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు.

అంతే కాకుండా గతంలో మోడీ ఇలాంటి వాగ్దానాలు గుప్పిస్తూ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా పోస్టు చేశారు. 2018కి సంబంధించిన ఆ వీడియోలో మోడీ ఎన్నో ప్రకటనలు గుప్పించారు. తాము 2022 కల్లా ఇళ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. 'మీ అందరి ఆశీర్వాదాలు నాతో ఉంటే ఈ కలలు నేను నెరవేరుస్తాను. 2022లో.. అంటే ఇప్పటి నుంచి మూడు నాలుగేళ్లలో మనం 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకోబోతున్నాం. గోవింద్ గురు లాంటి మహానుభావులు ఎలాంటి కలలను కని తమ ప్రాణాలను అర్పించారో.. అలాంటి స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తికానున్నాయి. ఇప్పుడు కూడా నేను ఒక దీక్ష చేపడుతున్నాను. 2022 కల్లా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే నాటికి.. దేశంలోని ఏ ఒక్క కుటుంబం కూడా పక్కా ఇల్లు లేకుండా ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీలాగా నాలుగు గోడలు నిలిపి ఇదే ఇల్లు అని చెప్పము. ఇల్లు, నీళ్లు, గ్యాస్ కనెక్షన్, కరెంటు కనెక్షన్, ఎల్ఈడీ బల్బులు, టాయిలెట్ నిర్మించి ఇస్తాం. ఇదే నా కల' అంటూ ఆనాడు మోడీ వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆ వాగ్దానాలే ఎంత వరకు వచ్చాయంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు

First Published:  3 Aug 2022 9:03 AM GMT
Next Story