Telugu Global
Telangana

జగన్‌ బాగా చేస్తున్నారు..

కరోనా ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీపైనా పడిందని.. అయినప్పటికీ ఆ సమయంలో జగన్‌మోహన్ రెడ్డి చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని ప్రజల్లో నమ్మకాన్ని నింపగలిగారని కేటీఆర్ ప్రశంసించారు.

జగన్‌ బాగా చేస్తున్నారు..
X

ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక `ది హిందూ`కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్.. ఏపీ ప్రభుత్వ తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్ రెడ్డి అత్యంత క్లిష్టపరిస్థితుల మధ్య కూడా ఏపీని సమర్థ‌వంతంగా ముందుకు నడిపిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగన్‌ సీఎం అయిన కొద్దికాలానికే ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిందని.. అలాంటి మహమ్మారి వచ్చిన సమయంలోనూ జగన్‌ మోహన్ రెడ్డి ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కగా నడిపించారని అభినందించారు. కరోనా ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీపైనా పడిందని.. అయినప్పటికీ ఆ సమయంలో జగన్‌మోహన్ రెడ్డి చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని ప్రజల్లో నమ్మకాన్ని నింపగలిగారని కేటీఆర్ ప్రశంసించారు.

సంక్షేమ పథకాల వల్ల ఆర్థికంగా దెబ్బతింటామన్న ప్రచారంలో వాస్తవం లేదని.. అది కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రచారం మాత్రమేనన్నారు. ఏపీ ఖజానా పరిస్థితిపై కేటీఆర్‌ను ప్రశ్నించగా.. బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ కంటే ఏపీ ఖజానా పరిస్థితి బెటర్‌గా ఉందన్నారు.

సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అత్యధికంగా పేద ప్రజలున్న మూడో ప్రపంచ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు పెట్టుకోవాలని కోరారు. పేదల ప్రజల బాగోగులు ప్రభుత్వం కాకుంటే మరెవరు చూస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు దేశం అప్పు 56 లక్షల కోట్లుగా ఉంటే.. నరేంద్రమోడీ వచ్చిన ఈ ఎనిమిదేళ్లలోనే 150 లక్షల కోట్లకు చేరిందని కేటీఆర్ గుర్తు చేశారు.

First Published:  21 Sep 2022 3:34 AM GMT
Next Story