Telugu Global
Telangana

మునుగోడు ఎన్నికల వేళ... మళ్లీ ఈడీ గోల

బండి సంజయ్ వ్యాఖ్యలు వింటే, ఇన్నాళ్ళుగా ఈడీని బీజేపీ వాళ్లు దుర్వినియోగం చేశారనే విషయం అర్థమవుతుందన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్‌ని ఈడీ లాంటి సంస్థలు ఏమి చేయలేవని అన్నారు.

మునుగోడు ఎన్నికల వేళ... మళ్లీ ఈడీ గోల
X

"బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరు." బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. మరి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలపై ఈడీ ప్రయోగం దేనికి సంకేతం. ఈడీని వాడుకుని మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో బీజేపీ చేస్తున్న అల్లకల్లోలం చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా బుకాయింపులు దేనికి అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో కూడా ఈడీ దాడులు జరుగుతాయంటూ గతంలో బండి సంజయ్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

బండి సంజయ్ వ్యాఖ్యలు వింటే, ఇన్నాళ్ళుగా ఈడీని బీజేపీ వాళ్లు దుర్వినియోగం చేశారనే విషయం అర్థమవుతుందన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం కేసీఆర్‌ని ఈడీ లాంటి సంస్థలు ఏమి చేయలేవని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో తాము కలసి నడవడం గ్యారెంటీ అన్నారు. మునుగోడలో వామపక్షాల ఓట్లు కీలకమన్న జగదీష్‌ రెడ్డి.. వామపక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు వామపక్షాలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మునుగోడులో బీజేపీకి మూడో స్థానమేనన్నారాయన.

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వెనక ఆయన దురాశతోపాటు, బీజేపీ నుంచి బెదిరింపులు కూడా ఉన్నాయని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో టీఆర్ఎస్‌పై ఈడీ ప్రయోగం ఎలాంటి ఫలితాలనివ్వదని చెబుతున్నారు. ఆ విషయం తెలిసే ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్నారని, లేకపోతే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేసినప్పుడే బీజేపీ తోక జాడించేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ మరోసారి ఈడీ వ్యవహారం తెరపైకి రావడంతో.. అసలు బీజేపీ కేంద్ర పార్టీ వ్యూహం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈడీ ఎంట్రీ ఇస్తుందని ఓసారి, ఈడీ వస్తే ఎవరూ మిగలరని మరోసారి.. బండి సంజయ్ చేస్తున్న కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

First Published:  14 Aug 2022 1:33 PM GMT
Next Story