Telugu Global
Telangana

నీటి వాటాలు, జీఎస్టీకోసం ఢిల్లీకి హరీష్ రావు

50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన హరీష్ రావు, ఐజీఎస్టీ బకాయిల అంశాన్ని నిర్మలమ్మకు గుర్తు చేశారు. చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాలేదని, ఫలితంగా కోట్లాది రూపాయల జీఎస్టీ బకాయిలు తెలంగాణకు బకాయిలుగానే మిగిలిపోతున్నాయని అన్నారు.

నీటి వాటాలు, జీఎస్టీకోసం ఢిల్లీకి హరీష్ రావు
X

తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలు, రావాల్సిన జీఎస్టీ బకాయిలకోసం మంత్రి హరీష్ రావు ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలసి విజ్ఞప్తి చేశారు. ఐజీఎస్టీ బకాయిల అంశాన్ని పరిష్కరించాలని కోరుతూ ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి వినతిపత్రం అందించారు. ఢిల్లీలోని విజ్జాన్‌ భవన్‌ లో జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన ఆయన, ఐజీఎస్టీ బకాయిల అంశాన్ని నిర్మలమ్మకు గుర్తు చేశారు. చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాలేదని, ఫలితంగా కోట్లాది రూపాయల జీఎస్టీ బకాయిలు తెలంగాణకు బకాయిలుగానే మిగిలిపోతున్నాయని అన్నారు.

తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని నిర్మలమ్మకు విజ్ఞప్తి చేశారు మంత్రి హరీష్ రావు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం నిధులు ఇవ్వాలని కోరారు. 4 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధులు రావాలన్నారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆయా అంశాల సత్వర పరిష్కారానికి వెంటనే అధికారుల బృందాన్ని కానీ, మంత్రుల బృందాన్ని కానీ ఏర్పాటు చేయాలని కోరారు హరీష్ రావు.

జల్ శక్తి మంత్రితో భేటీ..

తెలంగాణకు నీటి కేటాయింపులు పెంచాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలసి వినతిపత్రం అందించారు హరీష్ రావు. కృష్ణా జలాల వాటాల సంగతి తేల్చాలన్నారు. ఈ ఏడాది తెలంగాణకు కచ్చితంగా 50 శాతం కృష్ణా జలాలు ఇవ్వాలని కోరారు. గోదావరిలో పెండింగ్‌ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ లు కూడా పెండింగ్‌ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సమ్మక్క బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలని పరిష్కరించాలన్నారు. డెడ్‌ స్టోరేజీ నీటిని వాడుకునేలా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తోందని, దీనివల్ల తెలంగాణ, గోదావరి జలాల్లో తన హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని గజేంద్ర సింగ్ షెకావత్ ని కోరారు హరీష్ రావు.



First Published:  12 July 2023 12:44 AM GMT
Next Story