Telugu Global
Telangana

మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం మెలిక.. తెలంగాణకు అన్యాయం..

తెలంగాణతోపాటు, కర్నాటక, తమిళనాడు కూడా ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నాయి. కర్నాటక ప్రభుత్వం NMCకి లేఖ రాయగా, తమిళనాడు కూడా ఆ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం మెలిక.. తెలంగాణకు అన్యాయం..
X

తెలంగాణలో జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శంకుస్థాపనలు జరుగుతున్నాయనే సంతోషం ఓవైపు ఉండగా, మరోవైపు కేంద్రం కొర్రీలతో అసలు ఆ కాలేజీలు ప్రారంభవుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తెలంగాణలో మెడికల్ కాలేజీలకు ప్రతిబంధకాలుగా మారాయి. ఆ మాటకొస్తే దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోనూ కొత్తగా మెడికల్ కాలేజీలు ప్రారంభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో.. కొత్త కాలేజీల అనుమతి విషయంపై రాష్ట్ర వైద్యవిద్య డైరెక్టర్ డాక్టర్‌ రమేష్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ వెళ్లి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధికారులను కలిసి, మాట్లాడి వచ్చారు.

నిబంధనాలు..

ప్రతి పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్లతో మాత్రమే కొత్త మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తామని జాతీయ వైద్య కమిషన్‌ (NMC) ఆగస్టులో మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ నిబంధన ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాలకు కొత్త కాలేజీలు రావు. తెలంగాణతోపాటు, కర్నాటక, తమిళనాడు కూడా ఈ నిబంధనలను వ్యతిరేకిస్తున్నాయి. కర్నాటక ప్రభుత్వం NMCకి లేఖ రాయగా, తమిళనాడు కూడా ఆ నిబంధనలు వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు తెలంగాణ కూడా పోరాటం మొదలు పెడుతోంది.

తెలంగాణలో 3.5 కోట్ల జనాభాకు ఇప్పటికే 56 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలున్నాయి. మొత్తం 8515 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. కానీ, NMC తాజా నిబంధన ప్రకారం సీట్ల సంఖ్య 3500కి పరిమితం కావాలి. అంతకు మించి ఉంటే కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వరు. కానీ తెలంగాణ ప్రభుత్వం జిల్లాకో ప్రభుత్వ కాలేజీ చొప్పున శంకుస్థాపనలు చేస్తోంది. ఏర్పాటుకి అనుమతి కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో NMC ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


First Published:  30 Sep 2023 6:54 AM GMT
Next Story