Telugu Global
Telangana

నేటి సాయంత్రం.. అమరదీపం ప్రజ్వలన : తెలంగాణ సీఎంవో

తెలంగాణ సచివాలయం ఎదురుగా ఆరు అంతస్తుల్లో ఈ మహోన్నత అమరవీరుల జ్యోతిని ప్రభుత్వం రూపొందించింది.

నేటి సాయంత్రం.. అమరదీపం ప్రజ్వలన : తెలంగాణ సీఎంవో
X

తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా గురువారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదుట నూతనంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక ఆవిష్కరణ, అమర దీపం ప్రజ్వలన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతుందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నడిబొడ్డున యావత్ తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నదని సీఎంవో పేర్కొన్నది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్పూర్తిని నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్పురణకు తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 'అమర దీపం' హుస్సేన్‌సాగర్ తీరాన నేటి నుంచి దేదీప్యమానంగా వెలగనున్నదని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

తెలంగాణ సచివాలయం ఎదురుగా ఆరు అంతస్తుల్లో ఈ మహోన్నత అమరవీరుల జ్యోతిని ప్రభుత్వం రూపొందించింది. లుంబినీ పార్కును ఆనుకొని 3.29 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ అద్భుత స్మారకాన్ని నిర్మించింది. 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, ప్రమిద ఆకారంలో నిర్మించిన ఈ స్మారకం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకోనున్నది. 54,37 అక్షాల పొడవుతో దీర్ఘవృత్తాకారంలో ఈ ప్రమిదను నిర్మించారు. దీనికి ఒక వైపు 26 మీటర్ల ఎత్తు.. మరోవైపు 18 మీటర్ల ఎత్తు ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి దీపం 45 మీటర్ల ఎత్తులో నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ స్మారక నిర్మాణం కోసం మిత్తం 1,600 మెట్రిక్ టన్నుల స్టెయిన్ లెస్ స్టీల్ ఉపయోగించారు.

అమరవీరుల స్మారకం బేస్‌మెంట్ 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇక్కడ 160 కార్లు, 200 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. ఇక రెండవ బేస్‌మెంట్ 1,06,993 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉండగా.. ఇక్కడ 175 కార్లు, 200 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సైకర్యం ఉన్నది. అలాగే ఇక్కడ లాంజ్ ఏరియా, లిఫ్ట్, లాబీ, భూగర్భంలో 3 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న సంప్ కూడా ఏర్పాటు చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్ మొత్తంగా 28,707 అడుగుల విస్తీర్ణం ఉన్నది. ఇక్కడ మెయింటెనెన్స్, సివిల్, ఎలక్ట్రికల్ కార్యాకలాపాలకు సంబంధించిన గదులు నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్ 10,656 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నది. ఇక్కడ మ్యూజియం, ఫొటో గ్యాలరీతో పాటు 70 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడియో, విజువల్ రూమ్ ఏర్పాటు చేశారు.

రెండో ఫ్లోర్ విస్తీర్ణం 16,964 చదరపు అడుగులు ఉన్నది. ఇక్కడ కన్వెన్షన్ హాల్, లాబీ ఏరియా ఉన్నది. మూడో అంతస్తు 8,095 చదరపు అడుగులు ఉండగా.. ఇక్కడ కూర్చునే స్థలంతో పాటు.. రెస్టారెంట్, వ్యూ పాయింట్, ఓపెన్ టెర్రస్ సీటింగ్ సౌకర్యాలు ఉన్నాయి.

మెజ్జనైజ్ ఫ్లోర్ 5,900 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇక్కడ గ్లాస్ రూఫ్‌తో కూడిన రెస్టారెంట్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నాయి. అమర దీపం స్ట్రక్చర్‌ను తక్కవ కార్బన్ స్ట్రక్చరల్ స్టీల్‌తో తయారు చేశారు. ఇక్కడ 26 మీటర్ల జ్వాల రూపంలో ఉంటుంది. గోల్డెన్ ఎల్లో కలర్‌లో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది.

First Published:  22 Jun 2023 12:55 AM GMT
Next Story