Telugu Global
Telangana

సీఎం అంటే కొత్త నిర్వచనం చంద్రబాబు ముద్దుబిడ్డ

రేవంత్ రెడ్డిని కొందరు సీఎం సీఎం అంటున్నారని, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, చంద్రబాబు ముద్దు బిడ్డ అని కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

సీఎం అంటే కొత్త నిర్వచనం చంద్రబాబు ముద్దుబిడ్డ
X

రేవంత్ రెడ్డిని కొందరు సీఎం సీఎం అంటున్నారని, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, చంద్రబాబు ముద్దు బిడ్డ అని కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తమ అన్నదమ్ములపై మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల తాను సీఎం అయ్యే కల నెరవేరదనే అనుమానంతోనే రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన సోదరుడు వెంకటరెడ్డి కూడా త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా ఆమోదించకపోతే స్పీకర్ ఇంటి ముందు కూర్చుంటానన్నారు. సీఎం కేసీఆర్‌, కాంగ్రెస్ చేతిలో అవమానాలకు గురైన నాయకులు చాలా మంది బీజేపీలో చేరతారని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ముందస్తు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెప్పారు.

టీఆర్ఎస్ లోకి 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఎవరూ మాట్లాడలేదని.. వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తన విషయంలోనే రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడికి సహకరించానని, మూడున్నరేళ్లుగా మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోరాడానని చెప్పారు. 2014 తర్వాత పార్టీ పదవులు ఇవ్వకపోయినా కష్టపడ్డానన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని, తాను ఒక గుర్తుపై గెలిచి.. మరో పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగాలనుకోవడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగానే రాజీనామా చేసి.. బీజేపీలోకి వెళ్తున్నానని చెప్పారు.

మునుగోడు ప్రజలు తనపై ఎన్నో ఆశలతో గెలిపించారని, నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. ఇప్పుడు ఉపఎన్నిక వస్తుందని మునుగోడులో రోడ్లేస్తున్నారు.. సర్వేలు చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తే అప్పట్లోనే తన పదవి త్యాగం చేస్తానని చెప్పానని తన సొంత డబ్బుతో మునుగోడులో అనేక కార్యక్రమాలను చేపట్టానని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తాను ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఇంకో ఏడాదిన్నర కాలం ఉందని, కానీ మునుగోడు ప్రజల సమస్యల పరిష్కారానికే రాజీనామా ప్రకటించానన్నారు.

First Published:  6 Aug 2022 12:01 PM GMT
Next Story