Telugu Global
Telangana

తెలంగాణ.. ఎందరో అమర వీరుల త్యాగానికి ప్రతిఫలం

నేడు మనం సగౌరవంగా తెలంగాణ గడ్డపై తలెత్తుకొని.. ఇది నా తెలంగాణ అని అనగలుగుతున్నామంటే అది అమరుల త్యాగం, కేసీఆర్ నడిపించిన ఉద్యమమే కారణం.

తెలంగాణ.. ఎందరో అమర వీరుల త్యాగానికి ప్రతిఫలం
X

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని ఏనాడో కార్ల్ మార్క్స్ చెప్పాడు. అణచివేత, బానిసత్వం, నిర్బంధం నుంచి బయటపడాలి. మన హక్కులను మనం సాధించుకోవాలంటే పోరాటం తప్పని సరి. ఉమ్మడి పాలనలో అణచివేతకు, నిరాదరణకు గురైన తెలంగాణ ప్రాంతానికి పోరాటాలు కొత్తవే కాదు. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. తొలి దశ తెలంగాణ పోరాటమైనా.. మలి దశ తెలంగాణ ఉద్యమమైనా.. మనకు గుర్తుకు వచ్చేది అమరుల త్యాగమే. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ మలి దశ పోరాటాన్ని ముందుండి నడిపించినా.. అందుకు స్పూర్తి మాత్రం అమరుల త్యాగాలే అన్నది అక్షర సత్యం. అలాంటి అమరుల త్యాగాలను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గుర్తు తెచ్చుకోవడం తప్పనిసరి.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అమర వీరులంటే కేవలం మలి దశ ఉద్యమ సమయంలో అసువులు భాసిన వారే కాదు.. ఆనాడు తొలి దశ పోరాటంలో పాల్గొన్న వీరులు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. ఆనాటి అమరుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకోవడానికి గన్ పార్క్‌లో అమరుల స్తూపాన్ని నిర్మించారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అమర వీరులకు అత్యున్నత స్థానం దక్కాలి, వారి త్యాగాలను నిరంతరం గుర్తుకు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అమరుల స్మారక జ్యోతిని నిర్మించాలని నిర్ణయించారు. గురువారం ఈ అద్భుత నిర్మాణాన్ని ఆవిష్కరించనున్నారు.

నేడు మనం సగౌరవంగా తెలంగాణ గడ్డపై తలెత్తుకొని.. ఇది నా తెలంగాణ అని అనగలుగుతున్నామంటే అది అమరుల త్యాగం, కేసీఆర్ నడిపించిన ఉద్యమమే కారణం. మలి దశ ఉద్యమాన్ని సబ్బండ వర్ణాల పోరాటంగా మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే అమర వీరుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఒక చిహ్నాన్ని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్‌గా కాకుండా.. ఒక ఉద్వేగభరితమైన ప్రదేశంగా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన. అందుకే నిర్మాణం ఆలస్యమైనా.. ఒక అద్బుత కట్టడాన్ని అమరుల కోసం నిర్మించడం కేసీఆర్ ఆలోచనలకు ప్రతీకగా చెప్పవచ్చు.

తెలంగాణ మలి దశ ఉద్యమంలో దాదాపు 1200 మంది ఆత్మార్పణం చేశారు. స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి. 2009లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయం.. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో తెలంగాణ భవిష్యత్ యువ కిరణం శ్రీకాంతాచారి తనకు తాను నిప్పంటించుకొని అమరుడు అయ్యాడు. తెలంగాణ ఉద్యమకారులపై ఆనాటి పాలకులు లాఠీలు ఝులిపిస్తున్నారు. అడుగడుగునా ఉద్యమకారులపై నిర్బంధం నెలకొన్న సమయం.. ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేక.. తెలంగాణ కోసమే తపించే శ్రీకాంతాచారి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న అతడు.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని.. 'జై తెలంగాణ' అంటూ నినదిస్తూ.. మళ్లీ పుడతాను తెలంగాణలో అంటూ పిక్కటిల్లేలా అరుస్తూ ఆత్మాహుతి చేసుకున్నాడు.

ఆనాడు శ్రీకాంతాచారి మంటల్లో కాలుతున్న దృశ్యాలను చూసిన విద్యార్థులు, రైతులు, కార్మికులు, సకల జనులు ఉద్యమంలో కదం తొక్కారు. శ్రీకాంతాచారి స్పూర్తిగా తెలంగాణ కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీకాంతాచారి మాత్రమే కాకుండా కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, మీగడ సాయికుమార్ యాదవ్, ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. కిష్టయ్య కూమార్తె ఇప్పుడు డాక్టర్ చదువు పూర్తి చేసుకొని.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉద్యోగం చేస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఒక స్టేడియంకు సిరిపురం యాదయ్య పేరు పెట్టారు. ఎల్బీనగర్ జంక్షన్‌ పేరు శ్రీకాంతా చారి చౌరస్తాగా మార్చారు. ఇలా అమరుల త్యాగాలను ఎక్కడికక్కడ జ్ఞప్తికి తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అమరులకు నివాళి అర్పించనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్మించిన అమరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించి.. అక్కడే నివాళులు అర్పించనున్నారు. ఒక సామూహిక స్వప్నం సాకారమై.. దశాబ్దాల సంకెళ్లను తెంచుకొని.. ఇప్పుడు స్వరాష్ట్రంలో సుఖశాంతులతో మనం జీవిస్తున్నామంటే.. అందుకు అమర వీరుల త్యాగాలే కారణం. వారి త్యాగాలను నిరంతరం మనం గుర్తుంచుకోవడానికి స్మారక చిహ్నానికి మించిన ప్రతీక మరొకటి ఉండదు.

First Published:  21 Jun 2023 11:50 AM GMT
Next Story