Telugu Global
Telangana

విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1... ఎలా సాధ్యమైంది ?

ఈ రోజు తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పవర్ కట్లు లేని రోజులేని పరిస్థితి నుండి ఈ రోజు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ రావడానికి కారణాలేంటి ?

విద్యుత్ వినియోగంలో తెలంగాణ  దేశంలోనే నెంబర్ 1... ఎలా సాధ్యమైంది ?
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం చీకటిలో మగ్గిపోతుందని, కరెంట్ అనేదే ఉండదనే శాపనార్ధాలను తట్టుకొని, అనేక అడ్డంకులను ఎదుర్కొని ఈ రోజు తెలంగాణ 24 గంటల నాణ్యమైన విద్యుత్ వెలుగులు విర‌జిమ్మే రాష్ట్రంగా ఎలా ఏర్పడింది ?

2014కు ముందు పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య నీరు, విద్యుత్ సరఫరా. గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని వాగ్దానం చేసినా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కాలేదు. గతంలో ఏపీలో విద్యుత్ శాఖ రైతులకు రాత్రిపూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేది. దీంతో పలువురు రైతులు రాత్రి పూట పంపుసెట్లు ఆన్ చేసేందుకు పొలాల్లోకి వెళ్తుండగా విద్యుదాఘాతం లేదా పాము కాట్ల‌కు గురై మృతి చెందేవారు.

కానీ 2014 జూన్‌ తర్వాత రాష్ట్రంలో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్‌ రంగాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా తగినంత నీటితో పాటు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం ప్రారంభించినందున రైతులకు చాలా ఉపశమనం కలిగించింది.

2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ఐదు నెలల్లోనే విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి ఉన్నతాధికారులతో సమీక్షించారు. రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చారు, తర్వాత జనవరి 1, 2018 నుండి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం మొదలైంది.

26.96 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని అధికారులు అంటున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో వ్యవసాయ రంగానికి పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు విద్యుత్తు సరఫరా అయ్యేదని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అధికారులు తెలిపారు.

2014 నుండి, 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్ కనక్ష‌న్లు, రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి వ్యవసాయ రంగానికి రూ.36,890 కోట్ల సబ్సిడీని అందించారు. ఇది కాకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో రూ.37,099 కోట్లు ఖర్చు చేసింది. 400 కేవీ సబ్ స్టేషన్లలో 17, 200 కేవీ సబ్ స్టేషన్లలో 48, 132 కేవీ సబ్ స్టేషన్లలో 72, ఈహెచ్ టీ సబ్ స్టేషన్లలో 137, 33/11 కేవీ సబ్ స్టేషన్లలో 1038 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫారమ్ (డీటీఆర్) లు అందించారు.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలు బలోపేతం చేయబడ్డాయి. గరిష్టంగా 14,160 మెగావాట్ల డిమాండ్ కు తగ్గ విద్యుత్ అందుతోంది. గతంలో ఉమ్మడి ఏపీలో ప్రకటించిన పవర్ హాలిడేల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిశ్రమలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడంతో పూర్తిగా పనిచేస్తున్నాయి.

ఫలితంగా కార్మికులు నిరంతరం ఉపాధి పొందుతున్నారని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని అధికారులు తెలిపారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా 2021 నాటికి 2012 యూనిట్లకు చేరుకుంది. గతంలో ఉమ్మడి ఏపీలో ప్రసార, పంపిణీ నష్టాలు 16.06 శాతం నుంచి ఇప్పుడు 11.01 శాతానికి తగ్గాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి సౌర విద్యుత్ సామర్థ్యం 73 మెగావాట్లు కాగా, ప్రస్తుతం 4,950 మెగావాట్లకు చేరుకుంది.

రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం 2017 నుండి ఇప్పటి వరకు 5,96,642 మంది ఎస్సీ వినియోగదారులకు, 3,21,736 ఎస్టీ వినియోగదారులకు నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. ఈ వినియోగదారులకు సరఫరా చేయబడిన ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.656 కోట్లు ఖర్చు చేస్తోంది.

దాదాపు 29,365 నాయీబ్రాహ్మణుల సెలూన్లు, 56,616 లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతోపాటు 6,667 పౌల్ట్రీ యూనిట్లు, 491 పవర్‌లూమ్‌లకు యూనిట్‌కు రూ.2 సబ్సిడీతో విద్యుత్తు సరఫరా చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి పట్టు దల , విద్యుత్ ఉద్యోగుల శ్రమ అన్నీ కలిపి ఈ రోజు తెలంగాణను విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా నిలబెట్టిందని విద్యుత్ అధికారులు చెప్తున్నారు.

First Published:  26 Sep 2022 7:31 AM GMT
Next Story