Telugu Global
Telangana

మహిళలు, పిల్లల భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1

తప్పిపోయిన మహిళలు, పిల్లలను వెతికి పట్టుకోవడంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది.

మహిళలు, పిల్లల భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1
X

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, చిన్నపిల్లల రక్షణకు ప్రభుత్వ పెట్టపీట వేస్తోంది. ఇందుకోసం రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించి ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం ప్రణాళికలు రూపొందించారు. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్‌కి ప్రస్తుతం అడిషనల్ డీజీ షికా గోయల్ నాయకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలను ఉమెన్ సేఫ్టీ వింగ్ రూపొందిస్తోంది.

తప్పిపోయిన మహిళలు, పిల్లలను వెతికి పట్టుకోవడంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉన్నట్లు ఒక నివేదికలో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మిస్ అయినట్లు ఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనా.. ఉమెన్ సేఫ్టీ వింగ్ రంగంలోకి దిగి వారిని వెంటనే వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉమెన్ మిస్సింగ్ కేసుల్లో 87 శాతం మందిని వారి కుటుంబ సభ్యులకు తిరిగి అప్పగించారు. మరే రాష్ట్రంలోనూ ఇంత వేగంగా, అత్యధికంగా కేసులను సాల్వ్ చేసిన రికార్డు లేదు.

మహిళల భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, ఒక వాట్సప్ నంబర్ కూడా కేటాయించారు. ఏ మహిళకైనా ఎలాంటి ఆపద వచ్చినా.. వెంటనే ఆ నంబర్‌కు సమాచారం అందిస్తే ఉమెన్ సేఫ్టీ విభాగం వెంటనే స్పందిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉన్నా.. తెలంగాణ ఉమెన్ సేఫ్టీ విభాగం రెస్పాన్స్ స్పీడ్ మిగిలిన వారి కంటే వేగంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అలాగే మిస్సింగ్ కేసులను సాల్వ్ చేయడంలో కూడా ఇతర రాష్ట్రాలు వెనుకబడినట్లు తెలుస్తున్నది.

మహిళలు మిస్ అవడానికి చాలా వరకు బలమైన కారణాలేవీ ఉండటం లేదని ఉమెన్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో కనిపించకుండా పోయిన మహిళలు, పిల్లల కేసులను పరిశీలిస్తే.. చాలా చిన్న చిన్న కారణాలతోనే 99 శాతం మంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తున్నది. టీనేజ్ అమ్మాయిలు ముఖ్యంగా ప్రేమ విఫలం, కుటుంబ గొడవలు, ఆర్థిక సమస్యల కారణంగానే ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంచనాకు వచ్చారు.

గతంలో అమ్మాయిలను మాయ మాటలతో లొంగదీసుకొని వారిని బలవంతంగా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోని వ్యభిచార కూపాలకు అమ్మే ముఠాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి సంఘటనలు ఏవీ పెద్దగా నమోదు కావడం లేదని.. అమ్మాయిల్లో కూడా చాలా అవగాహన పెరిగిందని శిఖా గోయల్ చెప్పారు.

First Published:  30 July 2023 6:42 AM GMT
Next Story