Telugu Global
Telangana

ఓడీఎఫ్ ప్లస్ సాధించిన గ్రామాల్లో తెలంగాణే నెంబర్ 1 : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మిగిలిన అన్ని రాష్ట్రాలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు 100 శాతానికి చేరేలా కృషి చేయాలని షెకావత్ సూచించారు.

ఓడీఎఫ్ ప్లస్ సాధించిన గ్రామాల్లో తెలంగాణే నెంబర్ 1 : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
X

ఓడీఎఫ్ ప్లాస్ సాధించిన గ్రామాల్లో తెలంగాణే నెంబర్ 1న ఉందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. రాష్ట్రంలో ఓడీఎఫ్ ప్లస్ 100 శాతం దాటిందని తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేశంలో ఓడీఎఫ్ ప్లస్ విభాగంలో దేశం సాధించిన పురోగతిని వెల్లడించారు. 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలతో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ఇదక దేశం మొత్తం మీద ఓడీఎఫ్ ప్లస్ సాధించిన గ్రామాలు 40 శాతం మాత్రమే. అయితే గతేడాదితో పోల్చితే వీటి సంఖ్య 5 రెట్లు పెరిగిందని మంత్రి వెల్లడించారు.

స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా నిరుడు మార్చి నాటికి ఓడీఎఫ్ ప్లస్ సాధించిన గ్రామాలు దేశంలో 46,121 ఉండగా.. ఈ మార్చి నాటికి 2,38,973కు పెరిగిందని మంత్రి చెప్పారు. వీటిలో 1,60,709 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ఆస్పైరింగ్ కేటగిరీలో, 27,409 గ్రామాలు ప్లస్ రైజింగ్, 50,855 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మాడల్ కేటగిరిలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ టాప్‌లో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (95.7 శాతం), కర్ణాటక (93.7 శాతం) నిలిచాయి.

ఇక గతంలో కంటే మెరుగ్గా కొన్ని రాష్ట్రాలు పని చేశాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో 2022లో 18 శాతం గ్రామాలు ఉండగా.. ఈ ఏడాది 79 శాతానికి చేరాయి. మధ్యప్రదేశ్‌లో 6 నుంచి 62 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 2 నుంచి 47 శాతం, మిజోరాంలో 6 నుంచి 35 శాతానికి పెరిగినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని మిగిలిన అన్ని రాష్ట్రాలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు 100 శాతానికి చేరేలా కృషి చేయాలని షెకావత్ సూచించారు.

ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉంటే ఆ గ్రామాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. ఇక ఇండ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మించడం.. ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి.. వాటిని డంపింగ్ యార్డులో తడి చెత్త, పొడిచెత్తగా వేరు చేయడం.. శ్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు నిర్మించడం.. రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యక్రమాలు చేపడితే దాన్ని ఓడీఎఫ్ ప్లస్ గ్రామం అంటారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టడంతో 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిన రాష్ట్రంగా నిలిచింది.

First Published:  1 April 2023 1:58 AM GMT
Next Story