Telugu Global
Telangana

విదేశీ పెట్టుబడుల్లో దూసుకెళ్తున్న తెలంగాణ..!

ఆరు నెలల కాలంలో తెలంగాణకు రూ.8 వేల 655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.744 కోట్లు వచ్చాయని కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది.

విదేశీ పెట్టుబడుల్లో దూసుకెళ్తున్న తెలంగాణ..!
X

ఈ సంవత్సరం తొలి ఆరు నెలల్లో తెలంగాణకు ఏపీ కంటే పది రెట్లు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్యకాలంలో దేశంలోకి లక్షా 66 వేల 294 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో జనవరి-మార్చి మధ్యలో రూ.76,361 కోట్లు రాగా, ఏప్రిల్‌-జూన్‌ మధ్యలో రూ.89,933 కోట్లు వచ్చాయి.

ఈ ఆరు నెలల కాలంలో తెలంగాణకు రూ.8 వేల 655 కోట్లు రాగా, ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.744 కోట్లు వచ్చాయని కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం వెల్లడైంది. ఏపీకి మొదటి మూడు నెలల్లో రూ.297 కోట్లు, చివరి మూడు నెలల్లో రూ.447 కోట్లు దక్కాయి. తెలంగాణకు మొదటి మూడు నెలల్లో రూ.1,826 కోట్లు రాగా, చివరి మూడు నెలల్లో అవి రూ.6,829 కోట్లకు పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు అంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. ఈ త్రైమాసికంలో మహారాష్ట్రకు రూ.36,634 కోట్లు, ఢిల్లీకి రూ.15,358 కోట్లు, కర్ణాటకకు రూ.12,046 కోట్లు, తెలంగాణకు రూ.6,829 కోట్లు, గుజరాత్‌కు రూ.5,993 కోట్లు, తమిళనాడుకు రూ.5,181 కోట్లు, హర్యానాకు రూ.4,056 కోట్ల ఎఫ్‌డీఐలు ఇచ్చాయి. ఇందులో గుజరాత్‌ కంటే తెలంగాణ ఓ స్థానం ముందే ఉంది.

2023 మొదటి ఆరు నెలల్లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ 6వ స్థానంలో నిలువగా, ఆంధ్రప్రదేశ్‌ 12వ స్థానానికి పరిమితమైంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక తొలి మూడు స్థానాలను ఆక్రమించాయి. 16 రాష్ట్రాలకు ఒక్కోదానికి రూ.100 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇందులో మొదటి 7 రాష్ట్రాలకు కలిపి రూ.1,58,289 కోట్ల పెట్టుబడులు రాగా, మిగిలిన 9 రాష్ట్రాలకు కలిపి రూ.7,746 కోట్లు దక్కాయి. కేంద్ర వాణిజ్యశాఖలోని డీపీఐఐటీ 2019 అక్టోబరు నుంచి ఎఫ్‌డీఐలను రాష్ట్రాల వారీగా లెక్కిస్తోంది. అప్పటినుంచి ఈ ఏడాది జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.6,495 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా, తెలంగాణకు రూ.42,595 కోట్లు వచ్చాయి.

First Published:  31 Aug 2023 2:51 AM GMT
Next Story