Telugu Global
Telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. 61.68 శాతం మంది ఉత్తీర్ణత

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మంగళవారం విడుద చేశారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. 61.68 శాతం మంది ఉత్తీర్ణత
X

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల‌ చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఫస్టియర్, సెకండియర్ ఫలితాల సీడీని విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించిన ఇంటర్మీడియర్ పరీక్షలకు 9.47 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి 61.68 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ ఫస్టియర్‌లో 4,33,082 మంది హాజరవగా 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 62.85గా నమోదైంది. ఇక సెకండియర్ పరీక్షలకు 3.80,920 మంది హాజరవగా 2,56,241 మంది పాసయ్యారు. సెకండియర్ లో 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్, సెకండియర్ కలిపి 54.66 శాతం మంది బాలురు, 68.68 శాతం మంది బాలికలు పాస్ అయ్యారు.

ఇంటర్మీడియర్ పరీక్షల్లో గురుకులాలు, ప్రభుత్వ కాలేజీలు మెరుగైన ఫలితాలు సాధించినట్లు మంత్రి సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు, 1,473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. 26 వేల మంది సేవలు అందించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా.. సమయానికి ఫలితాలు విడుదల చేయడానికి సహకరించిన అందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఫస్టియర్‌లో మేడ్చెల్ జిల్లా, సెకండియర్ లో ములుగు జిల్లా విద్యార్థులు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారని మంత్రి పేర్కొన్నారు.

ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఎంసెట్ ఎంట్రెన్స్ టెస్టులో ఇంటర్ వెయిటేజీని తీసేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక పరీక్షలు ఫెయిల్ అయ్యామని ఏ విద్యార్థి కూడా ఒత్తిడికి లోనవ్వొద్దు.. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మంత్రి సూచించారు. త్వరలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. మంచిగా చదివి పాసవ్వాలని మంత్రి సబిత చెప్పారు. ఇక రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చని సూచించారు.

First Published:  9 May 2023 6:26 AM GMT
Next Story