Telugu Global
Telangana

దశాబ్ది సంబరం.. నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ చొరవతో తెలంగాణ, పారిశ్రామిక రంగంలో ఊహించని అభివృద్ధి నమోదు చేసింది. ఆ విజయాలన్నిటినీ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మరోసారి గుర్తు చేస్తారు.

దశాబ్ది సంబరం.. నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఐదోరోజుకి చేరుకున్నాయి. నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పారిశ్రామిక ప్రగతి ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. ఆ విజయాలను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా, మరిన్ని కొత్త కార్యక్రమాలను ఈ రోజున నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, వెనుకబడిన ప్రాంతాలలో కూడా ఉపాధి అవకాశాలను సృష్టించడం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. పరిశోధన నుండి ఆవిష్కరణ, ఆవిష్కరణ నుండి పరిశ్రమ, పరిశ్రమ నుంచి శ్రేయస్సు.. అనే లక్ష్యాలతో తెలంగాణలో ఇన్నోవేట్-ఇంక్యుబేట్-ఇన్‌ కార్పొరేట్ అనే నినాదంతో కొత్త పారిశ్రామిక విధానం -2015ను రూపొందించారు. ఈ విధానంతో పారిశ్రామిక అనుమతులు సులభమయ్యాయి. పరిశ్రమల స్థాపనలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి మరింత విస్తృతమైంది.

TS-iPASS - తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా పరిశ్రమలను స్థాపించే వారి స్వీయ-ధృవీకరణ ఆధారంగా పరిమితులకు లోబడి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోంది. నిర్ణీత గడువులోగా క్లియరెన్స్ ఇవ్వని అధికారులకు జరిమానాలు విధించే నిబంధన ఇందులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటులో ఎక్కడా ఆలస్యం జరగడంలేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల కింద కేంద్ర ప్రభుత్వం కూడా TS-iPASS ను ఉత్తమ విధానంగా గుర్తించింది. T IDEA తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ అడ్వాన్స్ మెంట్ పథకం పారిశ్రామికవేత్తలకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోంది. T PRIDE - తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్ ద్వారా ఎస్సీ, ఎస్టీలు, వికలాంగులను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతోంది. భారీ పరిశ్రమలతో ఒప్పందాలు, అదనపు పెట్టుబడి రాయితీలు, ఇతర రాయితీలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణకు TIHCL – తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ ఫర్ అసిస్టింగ్ సిక్ ఇండస్ట్రీస్ పేరుతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా సిర్పూర్ పేపర్ మిల్లు వంటి పలు పరిశ్రమలను పునరుద్ధరించింది.

పారిశ్రామిక ప్రగతిలో ఐటీ రంగం పాత్ర ప్రముఖంగా ఉంది. టి హబ్-1, 2 ద్వారా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకి విస్తృత అవకాశాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. టి వర్క్స్, వి హబ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ చొరవతో తెలంగాణ ఆ రెండు రంగాల్లో ఊహించని అభివృద్ధి నమోదు చేసింది. ఆ విజయాలన్నిటినీ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మరోసారి గుర్తు చేస్తారు.

First Published:  6 Jun 2023 2:51 AM GMT
Next Story